Ramagundam Medical College: పెద్దపల్లి జిల్లా రామగుండంలో వైద్యకళాశాల నిర్మాణం పూర్తవడమే కాకుండా అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభంతో విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఆనందపడుతున్నారు. సింగరేణి సంస్థ వైద్యకళాశాలకు 500కోట్లు కేటాయించడమే కాకుండా ప్రతీనెల 50కోట్లు విడుదల చేసింది. వైద్యకళాశాల పునాదుల తవ్వకాల సమయంలో నల్లరేగడి భూములు కావడం వల్ల నిర్మాణం ఆలస్యమవుతుందని భావించారు.
ఏప్రిల్‌లోగా కనీసం ఓ బ్లాక్ పూర్తి చేయాలనే సంకల్పంతో పనులు చేపట్టారు. వైద్యకళాశాలకు అనుమతి కావాలంటే కనీసం 70వేల చదరపు అడుగుల ఫ్లోర్ నిర్మాణం పూర్తి కావాలి. ఏప్రిల్‌లోగా ఒక్కో ఫ్లోర్‌లో 30వేల చదరపు అడుగుల చొప్పున 90వేల అడుగుల విస్తీర్ణం పూర్తి చేసి అనుకున్న లక్ష్యాన్ని సాధించారు. ఖరీదైన వైద్య విద్య ప్రైవేటులో చదివే అవసరం లేకుండా ప్రభుత్వ కళాశాలలో రావడంతో ఆర్థికంగా ఊరట లభించిందని విద్యార్థులు వారి కన్నవారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.