Floods in Manthani: గత ఐదు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు పెద్దపల్లి జిల్లా మంథని వద్ద గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది. గోదావరి వరద పోటెత్తడంతో గౌతమేశ్వరస్వామి ఆలయం చుట్టూ భారీ స్థాయిలో ప్రవహిస్తోంది. శ్రీ గౌతమేశ్వర స్వామి దేవాలయంలో 20 మంది అక్కడే చిక్కుకున్నారు. అనేక సంవత్సరాలుగా పూజలు నిర్వహిస్తూ అర్చకులు, సహాయకులు అక్కడే నివాసముంటున్నారు.
ప్రతిసారి వరదలు వచ్చినప్పుడు ఎటువంటి ప్రమాదం జరగలేదు. కానీ ఈ ఏడాది భారీగా వరదలు ఆలయాన్ని చుట్టుముట్టడంతో విద్యుత్, రవాణా సౌకర్యాలు నిలిచిపోయాయి. గత రెండు రోజులుగా వరద నీరు అంతకంతకు అమాంతంగా పెరుగుతుండడంతో భయభ్రాంతులకు గురవుతున్నామని తెలిపారు. అధికారులు వెంటనే చర్యలు తీసుకుని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని వేడుకుంటున్నారు.
అర్ధరాత్రి ఎమ్మెల్యే పరామర్శ:మంథని మండలంలోని నీట మునిగిన గ్రామాల ప్రజల పునరావాస కేంద్రాలను మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు పరిశీలించారు. అర్ధరాత్రి 2 గంటల వరకు మంథని మండలంలోని సూరయ్య పల్లి, పోతారం, బెస్తపల్లి, సిరిపురం, విలోచవరం గ్రామాల్లో ఇళ్లు నీట మునిగిన ప్రజలను కలిసి వారికి ధైర్యం చెప్పారు. గ్రామ ప్రజలకు నాగారం రైతు వేదిక, చిల్లపల్లి, బెస్తపల్లిలో ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకు వెళ్లి వారి పరిస్థితుల గురించి అడిగి తెలుసుకున్నారు. మంథని సీఐ, ఎమ్మార్వోతో ఫోన్లో మాట్లాడిన శ్రీధర్ బాబు పునరావాస కేంద్రాలలో ఉన్నవారికి అన్ని వసతులు కల్పించాలని సూచించారు. ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని.. అధికారులను రిస్క్ టీమ్‌ను అందుబాటులో ఉంచుకోవాలని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు విజ్ఞప్తి చేశారు.