Current Polls In Farming land: పెద్దపల్లి జిల్లా మంథని మండలం నాగారం గ్రామానికి చెందిన బెల్లంకొండ మల్లారెడ్డికి ఎకరం పొలం ఉంది. ఆ పొలం పక్కనే విద్యుత్ ఉపకేంద్రం ఉంటుంది. మూడేళ్ల కిందట మల్లారెడ్డి పొలంలో అధికారులు ఏకంగా 19 విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేశారు. అసలే చిన్నకారు రైతు. అధికారులతో పోరు పెట్టుకున్నా.. పట్టించుకున్న నాథుడే లేదు. ఇదిలా ఉండగా.. మల్లారెడ్డి కొంతకాలం కిందట మృతిచెందాడు. మల్లారెడ్డి తర్వాత ఆ పొలంలో ఆయన కుమారుడు రాఘవరెడ్డి వ్యవసాయం చేసుకుంటున్నాడు.
ఉన్న ఎకరంలో రాఘవరెడ్డి వరి సాగు చేస్తున్నాడు. పొలంలో ట్రాక్టర్లో దున్నాలంటే డ్రైవర్లు జంకుతున్నారు. దున్నినప్పుడల్లా ట్రాక్టర్లకు స్తంభాలు తగలటం వల్ల.. భయం భయంగానే సాగు చేయాల్సి వస్తోంది. కూలీలు కూడా పనికి రావాలంటే భయపడుతున్నారు. పనులు చేసేటప్పుడు కరెంట్‌షాక్ లాంటిదేమైనా ప్రమాదం సంభవిస్తే.. ఎవరు బాధ్యులని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఆ పొలంలోకి వచ్చేందుకు, సాగు చేసేందుకు ఎవరూ ఆసక్తి చూపట్లేదు.