నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం గడ్కోల్ గ్రామానికి చెందిన అన్నందాసు గంగాధర్, గంగామణి దంపతులకు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు. మొదటి సంతానంగా జ్యోతి జన్మించింది. తండ్రి గంగాధర్ పదో తరగతి వరకు చదివినా ఉద్యోగం రాకపోవడంతో మెకానిక్ షాపు నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. తల్లి బీడీలు చుడుతూ ఆసరాగా ఉండేది. ఆదాయం అంతంత మాత్రంగానే ఉండటంతో ఆర్థిక ఇబ్బందులు ఉండేవి. గ్రామంలో ఏడో తరగతి వరకే ఉండటంతో జ్యోతి అంత వరకే చదువుకుంది. పై చదువులకు మండల కేంద్రం సిరికొండకు కాలినడకన వెళ్లాల్సి వచ్చేది. కుటుంబం గడవడం ఇబ్బందిగా ఉండటంతో జ్యోతి చదువు మాన్పించారు. దీంతో జ్యోతి రెండు నెలల్లో కుట్టు మిషిన్ నేర్చుకుంది. బట్టలు కుడుతూ తండ్రి సంపాదనకు అండగా నిలిచింది. తోటి విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాసే సమయంలోనే టైలరింగ్ చేసి సంపాదించిన రూ.15వేల తోనే 15ఏళ్ల వయసులో జ్యోతికి పెళ్లి చేశారు.
ఏకసంతాగ్రహి...
పెళ్లయి అత్తగారింటికి వెళ్లినా జ్యోతి ఆలోచన చదువు చుట్టూనే తిరిగేది. దినపత్రిక, పుస్తకాలు.. ఇలా ఏది కనిపించినా అనర్గళంగా చదివి గుర్తుంచుకునేది. కుటుంబ బాధ్యతలు, పిల్లలు పుట్టడంతో చదువు పక్కకు పెట్టాల్సి వచ్చింది. ఈ సమయంలో తాను నేర్చుకున్న టైలరింగ్ వృత్తి చేస్తూ భర్తకు ఆర్థికంగా అండగా నిలిచింది. తనతోపాటు మరో నలుగురు మహిళలకు అప్పట్లోనే ఉపాధి కల్పించింది. 18 ఏళ్ల వయసులోనే బాబు సంతోష్ కుమార్, 21ఏళ్ల వయసులో పాప జాహ్నవి జన్మించింది. పిల్లలు పెద్దయిన తర్వాత మళ్లీ చదువుపై ఆలోచన మొదలైంది. బట్టలు కుడుతూ రేడియో వినే జ్యోతికి చదువు గురించి, మహిళల చైతన్యం గురించి చెప్పే మాటలు ఆకర్షించేవి. దీంతో పాప ఆరేళ్ల వయసున్నప్పుడు చదువుకుంటానని భర్తకు చెప్పింది. అతను అంగీకరించడంతో బట్టలు కుడుతూ, ఇంటి, వంట పని చేస్తూ పిల్లలను చూసుకుంటూనే దూరవిద్య విధానంలో డిగ్రీలో చేరింది. 12ఏళ్ల తర్వాత మళ్లీ పుస్తకం తన చేతికి రావడంతో అమ్మ ఒడిలో ఉన్నట్లే భావించింది. ప్రతి రోజూ అన్ని పనులు పూర్తి చేసి రాత్రి పడుకునే ముందు రెండు గంటలు చదువుకునేది. తెల్లారి పనులు చేసుకుంటూ రాత్రి చదివిన అంశాలను మననం చేసుకునేది. ఇలా డిగ్రీ పూర్తి చేసింది జ్యోతి.
అనుకున్నది సాధించి..
తను మళ్లీ చదువుకోవడానికి మరో బలమైన కారణం ఉంది. తన కంటే చిన్నవాళ్లైన చెల్లెళ్లు, తమ్ముడు ఉన్నత చదువు చదివి వివిధ రంగాల్లో స్థిరపడ్డారు. తల్లిదండ్రులు బంధువులెవరికైనా చెప్పేటప్పుడు వారి గురించి గొప్పగా చెప్పేవారు. తన గురించి చెప్పకపోవడం, తాను ఏడో తరగతితో చదువు ఆపేయడం ఆమెను బాధించేది. దీంతో మళ్లీ చదవడం ఆరంభించి దూరవిద్యలో డిగ్రీ పూర్తి చేసి నిజామాబాద్‌లోని ఓ ప్రైవేటు కళాశాలలో బీఈడీ కోర్సులో చేరింది. ఏడాది పాటు నిజామాబాద్‌లోనే గది అద్దెకు తీసుకుని పిల్లలతోపాటు ఉండి చదువుకునేది. పిల్లలను పాఠశాలకు పంపించి తాను కళాశాలకు వెళ్లేది. అలా బీఈడీ పూర్తి చేసిన జ్యోతి.. 2008 డీఎస్సీ నోటిఫికేషన్ రావడంతో ఎలాగైనా ఉద్యోగం సాధించాలని నిర్ణయించుకుంది. ఇందుకోసం తెలిసిన వాళ్ల సలహాతో కోచింగ్ కోసం పిల్లలను ఇంటిదగ్గరే వదిలి హైదరాబాద్ వెళ్లింది. రెండు నెలలపాటు కోచింగ్ తీసుకుని మరో మూడు నెలలు ఇంటి దగ్గర కఠోరంగా శ్రమించింది. చివరకు 2009లో తెలుగు పండిట్ ఉపాధ్యాయురాలిగా ఉద్యోగం సాధించి అనుకున్నది సాధించింది.