Nizamabad Costume Designer Success Story :నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం నీలా గ్రామానికి చెందిన సంగీత నాలుగో తరగతి వరకు చదువుకుంది. కుటుంబ ఆర్థిక పరిస్థితులు అంతగా సహకరించకపోవడం వల్ల సంగీత చదువు మానేసింది. అష్టాచమ్మా.. దాగుడు మూతలు ఆడుకోవాల్సిన వయసులోనే బీడీలు చుట్టాల్సి వచ్చింది. అలా చిన్నవయసులోనే బీడీలు చుట్టడం మొదలుపెట్టిన సంగీతకు యుక్తవయసు వచ్చిన తర్వాత ఎడపల్లి మండలం అంబం గ్రామానికి చెందిన సాయితో వివాహం జరిగింది.
Nizamabad Costume Designer Story : సాయిని పెళ్లి చేసుకున్న తర్వాత అతడితో కలిసి సంగీత నిజామాబాద్‌కు వచ్చేసింది. సాయి స్థానికంగా పాటలు పాడుతూ పిల్లలకు డ్యాన్స్ కొరియోగ్రాఫ్ చేసేవాడు. స్కూళ్లలో ఈవెంట్స్‌కు పిల్లలకు డ్యాన్స్ నేర్పించేవాడు. అలా వచ్చిన ఆదాయంతోనే వారి కుటుంబం గడిచేది. స్కూళ్లలో ఈవెంట్స్‌కు డ్యాన్స్ కొరియోగ్రాఫ్ చేసేటప్పుడు.. ఆ డ్యాన్స్‌కు సంబంధించి కాస్ట్యూమ్స్ కూడా సాయి ముంబయి, హైదరాబాద్ నగరాల నుంచి అద్దెకు తీసుకువచ్చేవాడు. ఆ తర్వాత మళ్లీ వాటిని రిటర్న్ చేసేవాడు. ఇదంతా సంగీత గమనించింది.
Women's Day special story : ఇలా కాస్ట్యూమ్స్ అద్దెకు తీసుకురావడం కాస్త ఖర్చుతో కూడుకున్న పని అని సంగీతకు అర్థమైంది. అదే తామే కాస్ట్యూమ్స్ డిజైన్స్ చేస్తే డబ్బు మిగలడంతో పాటు వాటిని అద్దెకు ఇస్తే కాస్త సంపాదన కూడా కూడబెట్టుకోవచ్చని ఓ నిర్ణయానికి వచ్చింది. ఆలోచన రాగానే తాను చిన్నప్పుడు నేర్చుకున్న టైలరింగ్‌పై ఫోకస్ చేసింది. కుటుంబం గడవడం కోసం తన భర్త ఒక్కడే రెక్కలు ముక్కలు చేసుకుని కష్టపడుతుండటం చూసి తానూ సాయంగా నిలవాలనుకుంది.
అనుకున్నదే తడవుగా పిల్లలకు కాస్ట్యూమ్స్ తానే డిజైన్ చేస్తానని భర్త సాయికి చెప్పింది సంగీత. సంగీత పనితనంపై నమ్మకంతో సాయి కూడా ఓకే చెప్పాడు. ఇంకేం సంగీత తన చేతులకు పని చెప్పింది. మంచి మంచి కాస్ట్యూమ్స్‌ను డిజైన్ చేసింది. కేవలం సాయి పని చేసే స్కూళ్లలోనే కాకుండా ప్రతి స్కూల్‌లో జరిగే ఈవెంట్‌లో తను డిజైన్ చేసిన కాస్ట్యూమ్సే వాడాలని నిర్ణయించుకుంది. అలా జరగాలంటే తన పనితనం అందరికీ తెలియాలి. ఇందుకోసం సంగీత సోషల్ మీడియాను వేదికగా చేసుకుంది.
సోషల్ మీడియా ద్వారా తన పనితనం, కాస్ట్యూమ్స్ కస్టమర్ల కంట్లో పడేలా చేసింది. అలా ఆన్‌లైన్‌లోనే ఆర్డర్లు రావడం మొదలయ్యాయి. స్కూల్ వార్షికోత్సవాలు, వినాయకచవితి, దుర్గామాత ఉత్సవాలు ఇలా పలురకాల ఈవెంట్లకు తానే కాస్ట్యూమ్స్ డిజైన్ చేసి అందిస్తూ కాస్ట్యూమ్ డిజైనర్‌గా ఆ ఏరియాలో మంచిపేరు తెచ్చుకుంది. ఈ కాస్ట్యూమ్స్‌ను అద్దెకు ఇవ్వడంతో పాటు పాఠశాలలో జరిగే కార్యక్రమాల్లో పిల్లలకు మేకప్ వేయడం, థీమ్‌కు తగ్గట్టుగా రెడీ చేయడం వంటివి కూడా చేయడం షురూ చేసింది. దీనికోసం నిజామాబాద్‌లో లాస్య ఆర్ట్స్ పేరుతో ఓ షాపు కూడా ఏర్పాటు చేసింది.
క్రమక్రమంగా ఆర్డర్లు పెరగడంతో సంగీత మరో పది మందిని తనకు సాయంగా నియమించుకుంది. తాను ఉపాధి పొందడమే కాకుండా ఇప్పుడు సంగీత మరో పదిమందికి ఉపాధి కల్పిస్తోంది. ఇలా భర్తకు తోడుగా కుటుంబ పోషణలో సాయపడాలని అనుకుని.. చదువుకోకపోవడం వల్ల వెనకడుగేస్తున్న ఆడవాళ్లకు సంగీత చేయూతగా నిలుస్తోంది. ప్రస్తుతం నిజామాబాద్‌తో పాటు కామారెడ్డి, నిర్మల్, జగిత్యాల, ఆదిలాబాద్ వరకు తను సేవలు అందిస్తోంది. తామున్న రంగంలోనే అవకాశాలను సృష్టించుకుని స్వయం ఉపాధి పొందిన కాస్ట్యూమ్ డిజైనర్ సంగీత... పలువురికి ఉపాధి కల్పించడం తోటి మహిళలకు స్ఫూర్తిగా నిలుస్తోంది.