తెలంగాణ

telangana

ETV Bharat / state

ఉదయం సర్పంచ్‌.. మధ్యాహ్నం నర్సు.. గ్రామం కోసం ఆమె ద్విపాత్రాభినయం.. - bonkanpally latest news

ఆమె ఓ గ్రామానికి ప్రథమ పౌరురాలు.. ఉదయం సర్పంచ్‌గా విధులు నిర్వహిస్తూ.. మధ్యాహ్నం ఓ ప్రైవేటు ఆస్పత్రిలో నర్సుగా పని చేస్తోంది. గ్రామ అభివృద్ధి చేస్తూనే.. ఆర్థిక ఇబ్బందుల నుంచి బయట పడేందుకు తన పూర్వ వృత్తిని చేపట్టింది. పంచాయతీ అభివృద్ధి పనుల కోసం చేసిన ఖర్చుకు సంబంధించిన బిల్లులతోపాటు... తన భర్త అనారోగ్యం కోసం చేసిన అప్పులు... ఆమె ద్విపాత్రాభినయం చేసేలా పరిస్థితులు దోహదం చేశాయి.

women playing two different roles as sarpanch in morning and nurse in afternoon
women playing two different roles as sarpanch in morning and nurse in afternoon

By

Published : Oct 23, 2021, 5:27 AM IST

ఉదయం సర్పంచ్‌.. మధ్యాహ్నం నర్సు.. ఊరు కోసం ఆమె ద్విపాత్రాభినయం..

నిజామబాద్ జిల్లా మాక్లూర్ మండలం బొంకన్‌పల్లికి చెందిన తోట పద్మ... మల్టీ పర్పస్‌ హెల్త్‌ వర్కర్‌ కోర్సు పూర్తి చేశారు. పదేళ్ల పాటు నిజామాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో నర్సుగా పనిచేశారు. రాజకీయాలపై ఆసక్తితో పాటు.. రిజర్వేషన్ కలిసి రావడంతో 2019లో బొంకన్‌పల్లి గ్రామ సర్పంచ్‌గా పోటీ చేశారు. తెరాస మద్దతు ఇవ్వడంతో విజయం సాధించారు. గ్రామ ప్రథమ పౌరురాలిగా ఎన్నిక కావడంతో.. నర్సు ఉద్యోగం మానేసి... గ్రామ అభివృద్ధిపై దృష్టి పెట్టి... పల్లె ప్రగతి, ఉపాధి హామి నిధులతో సుమారు 20లక్షల రూపాయల అభివృద్ధి పనులు చేయించారు. అంతకముందు ఎవ్వరూ చెయ్యని పనులు చేసి.. గ్రామస్థులతో శభాష్‌ అనిపించుకున్నారు సర్పంచ్ పద్మ. ఆమె పనితీరును మెచ్చుకున్న శిశు సంక్షేమ శాఖ.. ఏడాది క్రితం ఉత్తమ పని తీరుకు పురస్కారం సైతం ప్రదానం చేసింది.

మళ్లీ నర్సు విధుల్లోకి..

ఇంత వరకు బాగానే ఉన్నా.. కొన్ని రోజులుగా పద్మ ఆర్థిక పరిస్థితి ఇబ్బందిగా మారింది. ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు తప్పని పరిస్థితుల్లో.. మళ్లీ నర్సుగా విధుల్లో చేరారు. భర్త అనారోగ్యంతో మంచం పట్టడం, గ్రామంలో అభివృద్ధి పనుల కోసం... అప్పులు చేయడంతో ఆర్థికంగా ఇబ్బందులు తలెత్తాయి. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన... వైకుంఠ ధామం, డంపింగ్ యార్డులను 12లక్షల రూపాయలతో నిర్మించారు. అయితే ప్రభుత్వం నుంచి 8 లక్షల రూపాయలు మాత్రమే నిధులు విడుదలయ్యాయి. వీటితోపాటు మిగతా అభివృద్ధి కార్యక్రమాలకు... సొంత డబ్బులు ఖర్చు చేశారు. పూర్తి బిల్లులు రాకపోవడంతో ఇబ్బందులు తప్పలేదు. అప్పులు తీర్చేందుకు, తన కుటుంబాన్ని పోషించుకునేందుకు... మళ్లీ నర్సుగా ఉద్యోగానికి వెళ్తున్నారు పద్మ.

నిధులు సకాలంలో విడుదల కాక..

గ్రామ సర్పంచ్‌లకు నిధులు సకాలంలో విడుదల కాక.. చాలా మంది అప్పుల పాలవుతున్నారు. గతంలో నిజామాబాద్ శివారులోని ఓ సర్పంచ్... నగరంలో కొత్తగా నిర్మించే భవనం వద్ద వాచ్‌మెన్‌గా మారారు. ఇప్పుడు మరో సర్పంచ్.... నర్సుగా పని చేస్తున్నారు. ఇంకా ఎంతో మంది చిన్న పంచాయతీల సర్పంచ్‌లు... అప్పులు తీర్చేందుకు వివిధ మార్గాలు అన్వేషిస్తున్నారు. ప్రభుత్వం చేసిన పనులకు నిధులు విడుదల చేయాలని సర్పంచుల సంఘం ప్రతినిధులు కోరుతున్నారు. ఆ దిశలో సర్కారు చర్యలు తీసుకోవాలని అభ్యర్థిస్తున్నారు.

ఇదీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details