తెలంగాణ

telangana

ETV Bharat / state

అడవికి ఆమెతోనే అభయం.. అక్రమార్కులకు ఆమంటే భయం! - forest department latest news

అటవీ శాఖలో ఉద్యోగం అంటే కత్తి మీద సామే. పని వేళలతో సంబంధం లేకుండా సమస్యలకు ప్రతిస్పందించాల్సిన ఉద్యోగమది. కలప స్మగ్లింగ్, చెట్ల నరికివేత, జంతువుల వేట లాంటి వాటిని నిరోధించాల్సిన విధి. అడవి మృగాల మధ్య సైతం అన్ని వేళల్లో కాపలా నిర్వహించాల్సిన బాధ్యతల్లో మహిళలు తమ ధైర్యాన్ని చాటుతున్నారు. మగవాళ్లు సైతం భయపడే ఉద్యోగంలో చేరి వనాలను సంరక్షిస్తున్న నిజామాబాద్​ జిల్లా అటవీశాఖలోని వీర వనితలపై ఈటీవీ భారత్​ ప్రత్యేక కథనం.

women officers nizamabad forest department
women officers nizamabad forest department

By

Published : Jan 23, 2021, 7:01 PM IST

అడవిలో కొద్దిసేపు గడుపుదామంటే ఏదో తెలియని భయం. రమణీయమైన ప్రకృతి అందాలు ఉన్నప్పటికీ... ఏ వైపు నుంచి ఏ జంతువు దాడి చేస్తుందో అని భయపడటం సహజం. అలాంటి అడవుల్లో... ఎలాంటి జంకు లేకుండా మహిళలు ఉద్యోగాలు చేస్తున్నారు. అందులోనూ నిర్ణీత సమయం అంటూ లేని యూనిఫామ్ ఉద్యోగులైన అటవీశాఖలో బీట్ సెక్షన్ అధికారులుగా విధులు నిర్వహిస్తూ... మగువ దేంట్లోనూ తక్కువ కాదని నిరూపిస్తున్నారు.

అన్నివేళలా...

బీట్ పరిధిలో నిత్యం 10 నుంచి 15 కిలోమీటర్లు కాలినడకన పర్యవేక్షించాల్సి ఉంటుంది. ఎప్పటికప్పుడు తమ పరిధిలోని బీట్​లో ఆక్రమణలు లేకుండా సరిహద్దులు గమనిస్తూ వుండాలి. మొక్కల ఎదుగుదల, వన్యప్రాణుల కదలికలను గమనిస్తూ వుండాలి. వన్యప్రాణులకు ఆహారం, నీటి వసతి కల్పించడంతో పాటు వాటిని ఎవరు వెంటాడకుండా పర్యవేక్షణ కొనసాగించాలి. వారికి ఎంపిక చేసిన స్థలాల్లో మొక్కలు నాటి అడవి పెరుగుదలకు దోహదం చేయాలి. అటవీ నుంచి కలప, ఇసుక, మోరం తరలించకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. స్మగ్లర్ల నుంచి వన్యప్రాణులను కాపాడి వారికి శిక్షలు విధిస్తూ ఉండాలి. ఇంత కఠినమైన ఉద్యోగాల్లో... కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో మహిళలు 2 నుంచి 13 ఏళ్ల పాటు అటవీ అధికారులుగా సేవలందిస్తూ ప్రజలతో పాటు అధికారుల మన్ననలు పొందుతున్నారు.

అడవుల్లోనే సురక్షితమంటా...

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఆర్మూర్, కమ్మర్పల్లి, సిరికొండ, ఇందల్వాయి, వర్ని, నిజామాబాద్ ఉత్తరం, నిజామాబాద్ దక్షిణం, కామారెడ్డి, ఎల్లారెడ్డి, మాచారెడ్డి, నాగిరెడ్డిపేట్, బాన్సువాడ, పిట్లం, జుక్కల్, గాంధారి అటవి క్షేత్ర కార్యాలయాలు ఉన్నాయి. ఇందులో దాదాపు 30 శాతం వరకు బీట్ అధికారులు మహిళలే ఉండడం గమనార్హం. కార్యాలయంలో కాకుండా క్షేత్రస్థాయిలో పనిచేసే సిబ్బంది మహిళలు ఉండటం వారి ధైర్యానికి నిదర్శనం. ఇసుక ట్రాక్టర్లను అడ్డుకొని కేసులు నమోదు చేయడం, ఆక్రమణలు అడ్డుకోవడంలో మగవారికి ఏ మాత్రం తీసిపోకుండా ఉద్యోగం నిర్వర్తిస్తున్నారు. విధుల్లో చేరిన కొత్తలో కొంత భయపడినా... సహోద్యోగుల సహకారం, కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో ముందుకు వెళ్తున్నట్లు ఆ వీరనారీమణులు చెబుతున్నారు. చిన్న పిల్లలను సైతం కొందరు క్రూరత్వంతో హింసలకు గురి చేస్తున్నారని... ఆ వార్తలు విన్నప్పుడు సమాజంలో కంటే అడవుల్లోనే సురక్షితమనిపిస్తోందంటున్నారు.

అందరి బాధ్యత...

అటవీ సంరక్షణ కేవలం అటవీశాఖది మాత్రమే కాదని... అందరిదని ప్రజలు గుర్తించాలంటున్నారు అరణ్య రక్షకులు. కోట్ల రూపాయలతో హరితహారం చేపట్టే బదులు 10 ఏళ్ల పాటు అడవిలోకి ఎవరు వెళ్లకుండా ఉంటే వనాలతో పాటు వన్యప్రాణులు రెట్టింపు సంఖ్యలో విస్తరిస్తాయని అభిప్రాయపడుతున్నారు. ప్రతీ మగవాడి విజయం వెనుక ఆడది ఉన్నట్టే... ప్రతి మహిళ విజయం వెనుక ఆమె కుటుంబమే ఉంటుందని వనవనితలు చెబుతున్నారు.

ఇదీ చూడండి:ఊర్లో ప్రియురాలు, దుబాయ్​లో ప్రియుడు ఆత్మహత్య

ABOUT THE AUTHOR

...view details