తెలంగాణ

telangana

ETV Bharat / state

లాక్‌డౌన్‌లోనూ గుట్టుగా మద్యం అమ్మకాలకు లాకులెత్తేశారు..!

వేసిన షట్టర్లు వేసినట్లే ఉన్నాయ్‌.. లోపల మాత్రం సరకు ఖాళీ అయ్యింది. మంగళవారం మద్యం దుకాణాల తనిఖీలకు వెళ్లిన ఎక్సైజ్‌ అధికారులకు ఈ మతలబేంటో అర్థం కావడం లేదు. లాక్‌డౌన్‌ కాలంలోనూ మద్యం సరఫరాకు లాకులెత్తేశారు. దుకాణాల నిర్వాహకులే మద్యాన్ని అక్రమంగా బయటకు తరలించినట్లు అనుమానిస్తున్నారు. చాలా దుకాణాల్లో మద్యం పూర్తిగా అయిపోయినట్లు తెలుస్తోంది.

By

Published : May 6, 2020, 2:27 PM IST

nizamabad district latest news
nizamabad district latest news

రాష్ట్రంలో కరోనా వైరస్‌ తీవ్రత పెరగడం వల్ల మార్చి 22 నుంచి లాక్‌డౌన్‌ కొనసాగుతోంది. నిజామాబాద్​ జిల్లాలోని 91 మద్యం దుకాణాలు మూతబడ్డాయి. దుకాణాలకు అధికారిక సీళ్లు, ప్రత్యేక తాళాలు వేశారు. పలుచోట్ల నిర్వాహకులే రాత్రికిరాత్రి షట్టర్లు లేపి.. అక్రమాలకు తెరలేపారు. ఎంఆర్పీ కంటే మూడింతలు ధర చెప్పినా తీసుకోవడం వల్ల యథేచ్ఛగా దందా కొనసాగించారు. ఇప్పటి వరకు నాలుగు దుకాణాల నుంచి మద్యం బయటకు వెళ్లినట్లు గుర్తించిన ఆబ్కారీ అధికారులు నిర్వాహకులపై కేసులు నమోదు చేశారు.

తాజాగా తనిఖీలు...

ఎడపల్లి, బోధన్‌, ధర్పల్లి, డిచ్‌పల్లి, జక్రాన్‌పల్లి, ఇందల్వాయి, వర్ని, చందూరు, మోస్రా మండలాలతోపాటు మిగిలిన చోట్ల ఆబ్కారీ శాఖ అధికారులు విస్తృతంగా తనిఖీ చేశారు. నిల్వ దస్త్రాలు పరిశీలించారు. మంగళవారం మధ్యాహ్నం నుంచి తనిఖీలు జరిపారు. లాక్‌డౌన్‌కు ముందున్న మందెంత..? ప్రస్తుతం ఉన్నదెంతా అనే విషయమై ఆరా తీశారు. గతంలో కేసులు నమోదు చేసిన దుకాణాల్లో కాకుండా కొత్త వాటిల్లో తేడాలు గుర్తించినట్లు సమాచారం. అధికారులు మాత్రం అధికారికంగా వివరాలు వెల్లడించలేదు.

గ్రామస్థులు ఆందోళన...

కోటగిరి మండల కేంద్రంలోని మద్యం దుకాణంలో నిల్వ వివరాలు తెలపాలని గ్రామస్థులు ఆందోళన చేశారు. తనిఖీ చేయడానికి వెళ్లిన ఆబ్కారీ అధికారులను అడ్డుకొన్నారు. సమాచారం అందుకొన్న ఎస్సై మచ్చెందర్‌రెడ్డి వచ్చి ఆందోళనకారులను చెదరగొట్టారు.

తనిఖీలు కొనసాగుతున్నాయి....

ఉన్నతాధికారుల ఆదేశాలతో జిల్లా వ్యాప్తంగా మద్యం దుకాణాల్లో తనిఖీలు చేస్తున్నాం. ప్రస్తుతం ఉన్న మద్యం నిల్వలపై ఆరా తీస్తున్నాం. ఇప్పటికే జిల్లాలోని నాలుగు మద్యం దుకాణాలపై కేసులు నమోదు చేశాం. తాజా తనిఖీల్లో ఏవైనా అక్రమాలు గుర్తిస్తే తదనుగుణంగా చర్యలుంటాయి.

- నవీన్‌ చంద్ర, ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌

ABOUT THE AUTHOR

...view details