నిజమాబాద్ జిల్లా ప్రజల్లో విమానాశ్రయ ఏర్పాటుపై ఆశలు మళ్లీ చిగురించాయి. వైఎస్ హయాంలో ఎయిర్ పోర్టు ఏర్పాటు ఆలోచన చేయగా.. కేవలం పరిశీలనలు, సర్వేలు తప్ప అడుగు ముందుకు పడలేదు. ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఆరింటి ఏర్పాటుకు సై అన్నందున.. మరోసారి విమానాశ్రయం ఏర్పాటు అంశం తెరపైకి వచ్చింది. దశాబ్దకాలంగా నిజామాబాద్ జిల్లా వాసులను ఊరిస్తోన్న ఎయిర్‌పోర్టు ఏర్పాటు.. ఇప్పుడైనా ముందుకు కదలాలని భావిస్తున్నారు.
ఏర్పాటుకు 1,600 ఎకరాల భూమి..
మొదట జక్రాన్‌పల్లిలో విమానాశ్రయం ఏర్పాటు కోసం రెండువేల ఎకరాలు అవసరమవుతుందని భావించారు. ఆ తర్వాత డొమెస్టిక్ ఎయిర్‌పోర్టు నిర్మించేందుకు మొగ్గు చూపించి 1,600 ఎకరాల భూమి అవసరమవుతుందని భావించారు. ఇందులో 1300 ఎకరాలు అసైన్డ్ భూములుండగా.. మిగతావి పట్టా భూములున్నాయి. ఒకవేళ విమానాశ్రయం వస్తుందంటే... తగిన పరిహారం చెల్లింపుపై భూములిచ్చేందుకు రైతులు సిద్ధంగా ఉన్నారు.
జక్రాన్‌పల్లిలో ఎయిర్‌పోర్టుకు అనేక అనుకూలతలు :
- దేశంలో పెద్దదైన 44వ జాతీయ రహదారికి మూడు కిలోమీటర్ల దూరంలోనే ప్రతిపాదిత స్థలం ఉంది.
- ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు అధికంగా వెళ్లే వారు నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల జిల్లాల నుంచే ఉన్నారు. వీరి రాకపోకలకు విమానాశ్రయం వస్తే ప్రయాణం సుగమమవుతుంది.
- ఈ స్థలం హైదరాబాద్‌కు 170 కి.మీ.ల దూరంలోనే ఉంది. తద్వారా శంషాబాద్ మీద ఒత్తిడి పెరిగితే నిజామాబాద్‌ను ప్రత్యామ్నాయంగా వాడుకునే అవకాశముంది.
- నిజామాబాద్‌లో ఉన్న సీడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు ఇతర రాష్ట్రాల నుంచి వ్యాపారులు అధికంగా వస్తారు.
- అమెరికా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ తదితర దేశాల్లో చదువుకునేందుకు వెళ్లేవారికి ఇక్కడ విమానాశ్రయం అవసరం.