నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రిలోని ఓపీ విభాగంలో ప్రతిరోజూ 1400 మంది చికిత్స పొందుతుంటారు. 500 మంది ఇన్ పేషేంట్లుగా చికిత్స తీసుకుంటున్నారు. వీరితో పాటు కుటుంబ సభ్యులు, బంధువులు కలిసి మరో 500 మంది వరకు వస్తుంటారు. 400 మంది వరకు ఆస్పత్రి సిబ్బంది విధులు నిర్వహిస్తుంటారు. దాదాపు 3 వేల మంది వరకు ప్రతిరోజు ఆస్పత్రిలో ఉంటున్నా... వారికి తాగేందుకు గుక్కెడు మంచి నీళ్లు దొరకట్లేదు. శౌచాలయానికి వెళ్లాలన్నా... బయట నుంచి నీరు కొనుక్కొని తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.
నాలుగు బోర్లున్నా... చుక్క నీరు లేదు
ఇందూరు ప్రభుత్వాస్పత్రిలో మొత్తం నాలుగు బోర్లు ఉండగా... ఇటీవల భూగర్భ జలాలు పడిపోయి రెండు బోర్లు పూర్తిగా ఎండిపోయాయి. మరో రెండు బోర్లలోనూ నీళ్లు బాగా తగ్గిపోయాయి. ఆస్పత్రిలో గతంలో రూ.10 లక్షలతో ఏర్పాటు చేసిన నీటి శుద్ధి కేంద్రం నిరుపయోగంగా ఉంది. రోగులు, ఆస్పత్రి సిబ్బంది గత కొన్నాళ్లుగా మున్సిపల్ నీటి కుళాయి మీద ఆధారపడి అవసరాలు తీర్చుకుంటున్నారు. అయితే మొన్నటి వరకు 12 గంటలు నీటి సరఫరా చేసిన మున్సిపల్ అధికారులు... నాలుగైదు రోజుల నుంచి కేవలం 6 గంటలకే పరిమితం చేశారు. వీటి వల్ల రోగులు, రోగి తరఫు బంధువులు తీవ్ర సమస్యలు ఎదుర్కోవలసి వస్తోంది.
నీళ్లు కొనుక్కొచ్చి వైద్యం