Water Levels in Telangana Projects Today :ఉపరితల ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో మళ్లీ వర్షాలు మొదలయ్యాయి. గత రెండు రోజులుగా హైదరాబాద్ సహా జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా వానలు కురుస్తున్నాయి. వీటికి తోడు ఎగువ ప్రాంతాల్లో నుంచి వస్తున్న వరద నీటితో ప్రాజెక్టుల్లో క్రమంగా నీటిమట్టాలు పెరుగుతున్నాయి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలతో ప్రాజెక్టులకు భారీ ప్రవాహం వస్తోంది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద పోటెత్తడంతో గేట్లు ఎత్తి.. దిగువన గోదావరి నదిలోకి నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టులోకి ఇన్ఫ్లో భారీగా వస్తుండగా.. 4 గేట్లు ఎత్తి దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నిల్వ సామర్థ్యం 90 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 89.7 టీఎంసీలతో పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరువలో ఉంది. గేట్లు ఎత్తడంతో గోదావరి నది పరీవాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
Heavy Rains in Telangana Today : ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన.. తెలంగాణలో దంచికొడుతున్న వర్షాలు
Nizamsagar Water Level Today : కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ ప్రాజెక్టులోకీ వరద ప్రవాహం పెరిగింది. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 2,500 వేల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. నిజాంసాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 1,405 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 1,403.7 అడుగులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 17.8 టీఎంసీలకు గానూ.. ప్రస్తుత నీటి నిల్వ 16 టీఎంసీలుగా ఉంది.
Kadem Reservoir Water Level Today : నిర్మల్ జిల్లా కడెం జలాశయానికి ఎగువన ఉన్న ఆదిలాబాద్ జిల్లా ప్రాంతంలో కురుస్తున్న వర్షానికి జలాశయంలోకి వరద నీరు వచ్చి చేరుతుంది. కడెం జలాశయంలోకి 13,300 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుండటంతో.. 3 వరద గేట్ల ద్వారా 29,889 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. కడెం జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 700 అడుగులు కాగా.. ప్రస్తుత నీటి మట్టం 696.52 అడుగులకు చేరింది.