శ్రీరాంసాగర్ జలాశయానికి తగ్గిన వరద - sriramsagar water levels
ఎడతెరపి లేకుండా కురిసిన వర్షాలతో శ్రీరాంసాగర్ జలాశయానికి పొటెత్తిన వరద క్రమంగా తగ్గుతోంది. ప్రస్తుతం వరద ప్రవాహం 11, 484 క్యూసెక్కులుగా కొనసాగుతోంది. ఆయా కాల్వాల ద్వారా నీటిని వదులుతున్నారు.
శ్రీరాంసాగర్ జలాశయంలోకి ఎగువ ప్రాంతం నుంచి వచ్చి చేరుతున్న వరద తగ్గుముఖం పట్టింది. ప్రాజెక్టులోకి సోమవారం ఉదయం 26,904 క్యూసెక్కుల వరద చేరగా సాయంత్రం ఆరు గంటలకు 11,484 క్యూసెక్కులకు తగ్గింది. ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు వరకు ప్రాజెక్టులో 0.10 అడుగుల మేర పెరిగింది. జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టం 1091 అడుగులు కాగా, ప్రస్తుతం 1088.80 అడుగులకు చేరింది. ప్రాజెక్టులో 78.98 టీఎంసీల నీరు నిల్వ ఉంది. సరస్వతి కాల్వ ద్వారా 600 క్యూసెక్కుల నీటిని, కాకతీయ కాల్వ ద్వారా 50 క్యూసెక్కులు, లక్ష్మి కాల్వ ద్వారా 200 క్యూసెక్కులు, మిషన్ భగీరథ ద్వారా తాగు నీటి కోసం 152 క్యూసెక్కుల చొప్పున నీటిని వదులుతున్నారు.