ganesh chaturthi 2022 in telangana: సికింద్రాబాద్‌లో పర్యావరణ పరిరక్షణ నిమిత్తం మట్టి గణనాథులనే కాకుండా కాగితపు గణనాథుడ్ని ప్రతిష్ఠించారు. ఈస్ట్ మారేడ్‌పల్లి శ్రీ చైతన్య టెక్నో స్కూల్ ఉపాధ్యాయుడు పరశురాం ఏర్పాటు చేసిన కాగితపు గణనాథుడు చూపరులను విశేషంగా ఆకట్టుకుంటున్నాడు. ఐదు రోజుల పాటు శ్రమించి అత్యంత తక్కువ ఖర్చుతో తయారు చేసినట్లు పాఠశాల యాజమాన్యం తెలిపింది. దాదాపు 30 కిలోల పేపర్‌ను ఉపయోగించి ఈ గణనాథుడిని రూపొందించినట్లు పేర్కొన్నారు. తనకు ఇలాంటి భిన్న రకాలైన గణనాథులను తయారు చేయడంలో అనుభవం ఉందని.. గతంలోనూ ప్రకృతిలో లభించే వస్తువులు, పీచు, చాక్ పీస్‌లతో సైతం గణనాథుళ్లను తయారు చేసినట్లు తెలిపారు.
నిజామాబాద్ పట్టణంలోని పోచమ్మ గల్లీలో ఏర్పాటు చేసిన 54 అడుగుల గణపతి మట్టి విగ్రహం ప్రత్యేకంగా ఆకట్టుకుంటోంది. రవితేజ యూత్ ఆధ్వర్యంలో పర్యావరణాన్ని కాపాడాలనే ఉద్దేశంతో పది సంవత్సరాలుగా మట్టి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ను నిర్మూలించేందుకు.. ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఇలా చేస్తున్నామని అన్నారు. భవిష్యత్‌లో 108 అడుగుల మట్టి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు.
జగిత్యాలకు చెందిన సూక్ష్మ కళాకారుడు గుర్రం దయాకర్ మరోసారి తన ప్రతిభను చాటారు. గుండు పిన్నుపై లంభోధరున్ని తయారు చేసి ఔరా అనిపించారు. పసుపుతో తయారు చేసిన ఈ గణపతి 3 మిల్లీమీటర్లు ఉంది. దీని తయారీకి 11 గంటల సమయం పట్టినట్లు దయాకర్ తెలిపారు. ఏదేమైనా పర్యావరణం మీద ప్రేమతో పలువురు కళాకారులు, ప్రకృతి ప్రేమికులు.. విభిన్న పద్ధతుల్లో వారి నైపుణ్యాలను ప్రదర్శిస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నారు. ఔరా అనిపించే రీతిలో విగ్రహాలను తయారు చేసి భక్తులను అబ్బురపరుస్తున్నారు.