తమకు ఉపాధి కల్పించాలంటూ నిజామాబాద్‌లోని తెలంగాణ విశ్వవిద్యాలయం ముందు డిచ్పల్లి మండలం నడ్పల్లి తండా వాసులు ధర్నా చేపట్టారు. యూనివర్శిటీ కోసం తమ భూములు ఇస్తే.. ఉద్యోగాల ఊసే లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమ అర్హతకు తగినట్లుగా ఏ ఉద్యోగమిచ్చినా పనిచేస్తామని తెలిపారు. దయచేసి తమకు జోవనోపాధి కల్పించి ఆదుకోవాలని కోరుతున్నారు.
విశ్వవిద్యాలయం కోసం తమ జీవనాధారమైన భూములను కోల్పోయామని వాపోయారు. ఇటీవల కొత్తగా వచ్చిన వీసీని కలిసి విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు ఉద్యోగాలు రాకుండా కొందరు విద్యార్థి నాయకులు అడ్డుకుంటున్నారని తండా వాసులు ఆరోపించారు. విద్యార్థులకు మా ఉద్యోగాలతో పనేంటని నిలదీశారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి తమకు ఉద్యోగాలు కల్పించాలని నడ్పల్లి తండావాసులు విజ్ఞప్తి చేస్తున్నారు.