తెలంగాణ

telangana

ETV Bharat / state

ధరాఘాతం: వానాకాలంలోనూ కూరగాయల సెగలు - vegetable rates in telangana

వర్షాకాలంలోనూ కూరగాయల ధరలు మండిపోతున్నాయి. ఆకు కూరలలైతే కొండెక్కి కూర్చున్నాయి. పేద, మధ్యతరగతి ప్రజలు కూరగాయలు కొనేందుకు జంకుతున్నారు. రేట్లు అమాంతం పెరిగిపోతుండగా.. నియంత్రించే పరిస్థితులు లేవు. లాక్‌డౌన్‌ సమయంలోనూ ఇలాంటి పరిస్థితులు లేవని వినియోగదారులు వాపోతున్నారు. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా అన్ని మార్కెట్లలోనూ ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి.

vegetable rates very much hike in nizamabad
vegetable rates very much hike in nizamabad

By

Published : Sep 15, 2020, 8:07 PM IST

కొద్ది రోజులుగా కూరగాయల ధరలు భగ్గుమంటున్నాయి. ఉత్పత్తి తగ్గడం, మార్కెట్‌కు తగినంత సరఫరా లేకపోవడం వల్ల రేట్లు పెరిగిపోతున్నాయి. నిజామాబాద్ జిల్లాలో కూరగాయల సాగు పెద్దగా లేకపోవడం వల్ల ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. రవాణా, ఇతర ఖర్చులు కలిపి ధరలు అమాంతం పెరుగుతున్నాయి. స్థానికంగా బెండ, దొండ, వంకాయ, కొద్దిగా టమాట మాత్రమే లభిస్తుండగా.. మిగతావి మహారాష్ట్ర, హైదరాబాద్ నుంచి దిగుమతి అవుతున్నాయి. రవాణా ఛార్జీలు, హమాలీ, ఇతర ఖర్చులు కలిపి వినియోగదారుడికి రెట్టింపు భారమవుతున్నాయి.

వినియోగాదారుని జేబు ఖాళీ...

కరోనా ప్రభావం వల్ల జనం ఎక్కడికక్కడే కూరగాయలు కొనుగోలు చేస్తున్నారు. పెద్దగా మార్కెట్లకు రావడం లేదు. ఫలితంగా చిరు వ్యాపారులు ధరలు మరింత పెంచి అమ్ముతున్నారు. అధికారులెవరూ దృష్టిసారించకపోవడం వల్ల వినియోగదారుల జేబులు ఖాళీ అవుతున్నాయి. టోకు వర్తకులు కిలో 40 నుంచి 50 రూపాయలకు విక్రయిస్తుండగా.. చిరు వ్యాపారులు 60 నుంచి 80 వరకు విక్రయిస్తున్నారు.

సొరకాయ 30... మునగ 10...

టమాట, వంకాయ, బీర, కాకర, దోసకాయ, క్యారెట్‌, చిక్కుడు, బీన్స్‌ ఇలా అన్నింటి ధరలు మండిపోతున్నాయి. ఆకుకూరల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. పాలకూర, తోటకూర, మెంతికూర, కొత్తిమీర, పుదీనా 50 రూపాయలు పెడితేగానీ రావడం లేదు. సొరకాయ 30, మునగ ఒకటి రూ. 10 పలుకుతోంది. అధిక ధరల వల్ల అమ్మకాలు లేవని వ్యాపారులు సైతం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అధిక ధరలతో వినియోగదారులు కూరగాయల మార్కెట్‌కు వెళ్లాంటేనే జంకుతున్నారు. పప్పులు, ఇతర వంటలతో సరిపెట్టుకుంటున్నారు. వర్షాలు తగ్గి.. స్థానికంగా ఉత్పత్తి పెరిగితే ధరలు తగ్గుతాయని వ్యాపారాలు, వినియోగదారులు భావిస్తున్నారు.

ఇవీ చూడండి:నిజామాబాద్​ జిల్లాలో భారీ వర్షాలు.. నీట మునిగిన పొలాలు

ABOUT THE AUTHOR

...view details