TU VC vs EC Controversy Update : నిజామాబాద్‌లోని తెలంగాణ విశ్వవిద్యాలయంలో రిజిస్ట్రార్ నియామకం విషయంలో ఉపకులపతి(వీసీ) ఆచార్య రవీందర్, పాలకమండలి మధ్య వివాదం ప్రస్తుతానికి సద్దుమణిగింది. వారంతా ఏకతాటిపైకి వచ్చి ఉద్యోగుల వేతనాల సమస్య పరిష్కరించారు. నిర్మలాదేవి వైదొలిగి ఆచార్య యాదగిరి రిజిస్ట్రార్ బాధ్యతలు చేపట్టినా.. ఆయన సంతకాన్ని బ్యాంకు అధికారులు అనుమతించలేదు.
పాలకమండలి, రిజిస్ట్రార్‌తో వీసీ భేటీ:దీంతో మంగళవారం కూడా వేతనాల కోసం పొరుగుసేవల ఉద్యోగులు తమ నిరసన కొనసాగించారు. మధ్యాహ్నం 3 గంటల తర్వాత వర్సిటీకి వీసీ వచ్చారు. పొరుగుసేవల ఉద్యోగులు, నలుగురు ఈసీ సభ్యులు, రిజిస్ట్రార్ యాదగిరి, విద్యార్థి నాయకుల సమక్షంలో వేతనాల బిల్లులపై ఆయన సంతకం చేశారు. ఉద్యోగుల జీతాల సమస్య పరిష్కారమైన అనంతరం నలుగురు పాలకమండలి సభ్యులు, రిజిస్ట్రార్‌తో ఉపకులపతి రవీందర్ తన ఛాంబర్లో భేటీ అయ్యారు. అంతర్గతంగా జరిగిన ఈ సమావేశంలో వివాదాలను పక్కన పెట్టి వర్సిటీ అభివృద్ధికి కలిసి పనిచేద్దామనే అభిప్రాయానికి వచ్చారు. వీసీ అనుమతి లేకుండా పాలకమండలి సమావేశానికి హాజరైన వారికి షోకాజ్ నోటీసులు జారీ చేయగా.. వాటిని రద్దు చేయాలని సభ్యులు కోరారు. అందుకు వీసీ సమ్మతించారు.
వీసీతో ఎలాంటి గొడవలు లేవన్న రిజిస్ట్రార్..: ఆచార్య విద్యావర్ధినిని అవమానించడం వల్లే తాను పాలకమండలి సమావేశాలను బహిష్కరించానని వీసీ పేర్కొన్నారు. వ్యక్తిగత గౌరవానికి భంగం కలిగేలా తన పీహెచ్‌డీ విషయంలో విలేకరులతో మాట్లాడిన విషయాన్ని రిజిస్ట్రార్ యాదగిరి ప్రస్తావించారు. వీసీతో తనకు ఎలాంటి గొడవలు లేవని, ఎవరి ఒత్తిళ్లకు తలొగ్గి పనిచేయనని పేర్కొన్నారు. వీసీ స్పందిస్తూ.. తనకు ఇతరులిచ్చిన సమాచారం మేరకు అలా మాట్లాడాల్సి వచ్చిందన్నారు. తనపై దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపించాలని కోరడం.. ప్రభుత్వానికి లేఖలు రాయడం సమంజసం కాదన్నారు. ఈసీ సభ్యులు స్పందిస్తూ.. అప్పటి పరిస్థితులకు అనుగుణంగా ఈసీ నిర్ణయాలు తీసుకుందని, ఎటువంటి లేఖలు రాయలేదని చెప్పినట్లు సమాచారం.
12న జరిగే పాలకమండలి సమావేశానికి హాజరవుతా: అకడమిక్ ఆడిట్ విభాగంలో పదవిలో ఉన్న కనకయ్యను ఆ బాధ్యతల నుంచి తప్పించాలని విద్యార్థి సంఘాల నాయకులు కోరారు. దానికి వీసీ రవీందర్ గుప్తా సమ్మతించారు. 12న జరిగే పాలకమండలి సమావేశానికి హాజరవుతానన్నారు. వివాదం పరిష్కారానికి దోహదం చేసిన అంశాలపై వీసీని అడగ్గా.. ఉద్యోగుల వేతనాల సమస్య ఎక్కువ రోజులు కొనసాగించటం సబబు కాదని ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.
ఇవీ చదవండి: