కరోనా సహాయక కేంద్రాలుగా సీపీఎం కార్యాలయాలను వినియోగించనున్నట్లు ఆ పార్టీ నిజామాబాద్ జిల్లా కార్యదర్శి రమేశ్ బాబు తెలిపారు. పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో చర్చించి తీసుకున్న నిర్ణయాన్ని ఆయన ప్రకటించారు.
జిల్లాలో కరోనా మహమ్మారి పెరుగుతున్న సందర్భంలో అనేకమంది నిరుపేదలు, అద్దె ఇళ్లల్లో ఉండేవారు.. కరోనా సోకి కుటుంబం మొత్తం ఇబ్బందులు పడుతున్నారని రమేశ్ బాబు అన్నారు. వారికి తమ పార్టీ తరఫున అండగా ఉండాలని.. అటువంటి వారిని ఆదుకోవడానికి సహాయక కేంద్రాలను నిర్వహించాలని నిర్ణయించామన్నారు.
ఐసోలేషన్ కేంద్రాలుగా...
కొవిడ్‌తో ఇబ్బంది పడేవారు తమ కార్యాలయాలను క్వారంటైన్ కేంద్రాలుగా ఉపయోగించుకోవచ్చని ఆయన తెలిపారు. అదేవిధంగా జిల్లా అధికారులను కలిసి తమ కార్యాలయాలను ఐసోలేషన్ కేంద్రాలుగా వినియోగించడానికి కావలసిన మెడికల్ కిట్స్, పడకలు, ఏఎన్ఎం లను సమకూర్చాలని విజ్ఞప్తి చేశారు.
అడిగిన వారందరికీ టెస్టులు, ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ ఇచ్చే విధంగా చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రజలు తమ హెల్ప్‌లైన్ నంబర్ 9949136833 ను సంప్రదించి కావలసిన సహాయం పొందాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా నాయకులు పెద్ద వెంకట్రాములు, ప్రజా సంఘాల బాధ్యులు శిల్ప లింగం, నూర్జహాన్, గోవర్దన్, సూరి, మహేశ్ పాల్గొన్నారు.
ఇదీ చూడండి:కేసీఆర్‌కు ప్రజల ఆరోగ్యం కంటే డబ్బులే ముఖ్యం: వీహెచ్