Turmeric prices: పసుపు ఉత్పత్తిలో 3.13లక్షల టన్నుల దిగుబడితో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో ఉంది. నిజామాబాద్, జగిత్యాల, నిర్మల్, వరంగల్, మహబూబాబాద్ జిల్లాల్లో పసుపు పంట ఎక్కువగా సాగవుతోంది. ముఖ్యంగా నిజామాబాద్, జగిత్యాల జిల్లాల్లో అత్యధికంగా 50వేల ఎకరాల్లో పంట సాగవుతుంది. ఈ ఏడాది అధిక వర్షాలతో పసుపురైతులు తీవ్రంగా నష్టపోయారు. దుంపకుళ్లు రోగం వచ్చి పంట దిగుబడి బాగా పడిపోయింది. ఎకరానికి 35క్వింటాళ్లు వస్తుందనుకుంటే.. 15నుంచి 20క్వింటాళ్లు మాత్రమే వచ్చింది. రైతులకు ఒక్కో ఎకరానికి లక్ష నుంచి లక్షన్నర ఖర్చవుతుండగా.. కనీసం పెట్టుబడి రాని పరిస్థితి నెలకొంది. వాణిజ్య పంటలైన పత్తి, మిరపకు రికార్డు ధరలు పలుకుతుంటే.. తమ పరిస్థితి మాత్రం దయనీయంగా తయారైందని పసుపు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పసుపు ధరలు మాత్రం.. 30 ఏళ్ల క్రితం 3వేల ధర పలికిన పసుపు ప్రస్తుతం 6 వేలు పలుకుతోంది. 2010-11లో 18వేల ధర పలికిన పసుపు.. ఇప్పుడు 6 వేలే పలుకుతోంది. పెట్టుబడి ధరలు రాకపోవడం వల్లే సాగును తగ్గించుకుంటూ వస్తున్నాం. ఎరువుల ధరలు పెరుగుతున్నాయి కానీ పసుపు ధరలు మాత్రం పెరగడం లేదు. -జనార్థన్, పసుపు రైతు