నిజామాబాద్ జిల్లా పసుపు రైతులు మద్దతు ధర కోసం మరోసారి ఆందోళన చేపట్టారు. ఆర్మూర్ మామిడిపల్లి వద్ద 44వ జాతీయ రహదారిపై మూడు గంటల పాటు బైఠాయించి రాస్తారోకో చేపట్టారు. పసుపు పంట చేతికొస్తున్న తరుణంలో మద్ధతు ధర కోసం రైతులు పోరాటం ఉద్ధృతం చేశారు. పసుపు పంటకు 15వేల మద్దతు ధరతో పాటు ఇచ్చిన హామీ మేరకు బోర్డు ఏర్పాటు చేయాలని నినదించారు. కొన్నేళ్లుగా డిమాండ్ చేస్తున్నా పరిష్కారం చూపక పోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
మద్దతు ధర ప్రకటించాలి
రైతు సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో తలపెట్టిన పసుపు రైతుల ఆందోళనకు ప్రముఖ విద్యావేత్త ఆచార్య కె.నాగేశ్వర్ రోడ్డుపై బైఠాయించి మద్దతు తెలిపారు. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరిపై మరొకరు నెపం నెట్టేసుకుంటూ కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. పసుపుబోర్డు ఏర్పాటుతో పాటు 15వేల మద్దతు ధర ప్రకటించాలని డిమాండ్ చేశారు.