TSPSC Group 1 Hall Ticket Controversy in Nizamabad : రాష్ట్రవ్యాప్తంగా గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష ఆదివారం జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకోకపోయినా ఓ అభ్యర్థికి హాల్ టికెట్ వచ్చిందంటూ నిన్నటి నుంచి సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరుగుతోంది. తాజాగా దీనిపై తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) వివరణ ఇచ్చింది. ఆ వార్తలను టీఎస్‌పీఎస్సీ అధికారులు తీవ్రంగా ఖండించారు. అదంతా తప్పుడు ప్రచారమని స్పష్టం చేశారు. నిజామాబాద్‌కు చెందిన అభ్యర్థి జక్కుల సుచిత్ర గతేడాది గ్రూప్-1 పరీక్షకు అప్లై చేశారని.. అక్టోబర్‌లో నిర్వహించిన ఎగ్జామ్‌కు ఆమె హాజరయ్యారని తెలిపారు. ఈ క్రమంలోనే గ్రూప్-3, గ్రూప్-4 పరీక్షల కోసం దరఖాస్తు చేస్తే గ్రూప్-1 ప్రిలిమినరీ హాల్‌టికెట్ ఇచ్చారన్న ప్రచారం అబద్ధమని కొట్టి పారేశారు.
'నిజామాబాద్‌కు చెందిన జక్కుల సుచిత్ర అనే అభ్యర్థి గతేడాది గ్రూప్-1 పరీక్షకు అప్లై చేశారు. అక్టోబర్‌లో నిర్వహించిన ఎగ్జామ్‌కు హాజరయ్యారు. గ్రూప్-3, గ్రూప్-4 పరీక్షలకు దరఖాస్తు చేస్తే గ్రూప్-1 ప్రిలిమినరీ హాల్ టికెట్ ఇచ్చారన్న ప్రచారం అబద్ధం.'- టీఎస్‌పీఎస్సీ అధికారులు
ఇదీ అసలు విషయం..: నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణానికి చెందిన సుచిత్ర అనే యువతి.. తాను గ్రూప్-1 పరీక్షకు దరఖాస్తు చేయకుండానే హాల్ టికెట్ వచ్చినట్లు పేర్కొన్నారు. గ్రూప్-3, గ్రూప్-4 పరీక్షల కోసం అప్లై చేసిన తనకు.. ఆదివారం జరిగిన గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష హాల్ టికెట్ డౌన్‌లోడ్ చేసుకోవాలని మెసెజ్ వచ్చిందని తెలిపారు. దీంతో హాల్ టికెట్ డౌన్‌లోడ్ చేయగా.. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో పరీక్ష కేంద్రం వచ్చినట్లు వివరించారు. దరఖాస్తు చేయకుండానే హాల్ టికెట్ రావడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. తాను కేవలం గ్రూప్-3, గ్రూప్-4లకు మాత్రమే అప్లై చేశానని.. గ్రూప్-1 హాల్ టికెట్ ఎలా వచ్చిందో అర్థం కావడం లేదన్నారు.
'గ్రూప్-1 హాల్‌టికెట్ డౌన్‌లోడ్ చేసుకోవాలని ఈ నెల 8న నా ఫోన్‌కు మెసెజ్ వచ్చింది. 9న నెట్ సెంటర్‌కు వెళ్లి డౌన్‌లోడ్ చేసుకుంటే.. నిజామాబాద్‌లో సెంటర్ వచ్చింది. నేను అసలు గ్రూప్-1కు అప్లై చేయలేదు. గ్రూప్-3, గ్రూప్-4 పరీక్షలకు మాత్రమే దరఖాస్తు చేశాను.' - అభ్యర్థి జక్కుల సుచిత్ర