'ఇందూరు లోక్‌సభ ఎన్నికలకు అన్నీ ప్రత్యేకమే' పసుపు, ఎర్రజొన్న పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలన్న డిమాండ్‌తో రైతులు భారీగా నామినేషన్లు దాఖలు చేయడం వల్ల నిజామాబాద్ లోక్‌సభ ఎన్నిక ప్రతిష్ఠాత్మకంగా మారింది. 185 మంది అభ్యర్థులు బరిలో ఉండటం వల్ల ఈవీఎంలతో పోలింగ్ నిర్వహించడం ఓ రకంగా సవాలే. ఇందుకోసం అధికారులు యుద్ధప్రాతిపదికన ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ఈసీఐఎల్, బెల్ నుంచి అత్యాధునిక ఎం-3 ఈవీఎంలు ఇందూరు చేరుకున్నాయి. బ్యాలెట్ యూనిట్లలో బ్యాలెట్ పత్రాలను ఉంచే క్యాండిడేట్ సెట్టింగ్ ప్రక్రియను కూడా ప్రారంభించారు. ఈసీ ప్రత్యేక పర్యవేక్షణ
ఏర్పాట్లను రాష్ట్ర ఎన్నికల సంయుక్త ప్రధానాధికారి జ్యోతి బుద్ధ ప్రకాష్, ప్రత్యేకాధికారి రాహుల్ బొజ్జా పర్యవేక్షించారు. ఇందూరు ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న కేంద్ర ఎన్నికల సంఘం... నిత్యం పర్యవేక్షిస్తోంది. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్ ఎప్పటికప్పుడు వివరాలు తెలుసుకుంటూ సన్నద్ధతను సమీక్షిస్తున్నారు.
హెలికాప్టర్ కేటాయింపు
ఎన్నిక ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకొని ప్రత్యేకంగా ఓ హెలికాప్టర్‌ను కేటాయించారు. 12 వరకు నిజామాబాద్ రిటర్నింగ్ అధికారి ఆధీనంలోనే హెలికాప్టర్ ఉండనుంది. ఎక్కడైనా ఎలాంటి ఇబ్బంది తలెత్తినా... యంత్రాలు, మానవవనరుల తక్షణ తరలింఫునకు వీలుగా ఈ ఏర్పాటు చేశారు. ఎక్కువ సంఖ్యలో బ్యాలెట్ యూనిట్లు ఉపయోగిస్తున్నందున పోలింగ్ సిబ్బంది, సెక్టోరల్ అధికారుల సంఖ్యను పెంచారు. ఇంజినీర్ల సంఖ్య కూడా భారీగా పెరిగింది. నియోజకవర్గ పరిధిలో 700 మందికి పైగా ఇంజినీర్లు పోలింగ్ ముగిసేంత వరకు అందుబాటులో ఉండి సేవలు అందించనున్నారు.
ప్రత్యేక అధికారుల నియామకం
రాష్ట్ర వ్యవసాయ కమిషనర్ రాహుల్ బొజ్జాను ఇప్పటికే ప్రత్యేకాధికారిగా నియమించగా... మరికొంత మందికి ప్రత్యేక బాధ్యతలు అప్పగించారు. ఇద్దరు సంయుక్త కలెక్టర్లు, నలుగురు డిప్యూటీ కలెక్టర్లతో పాటు ప్రతి నియోజకవర్గానికి అదనంగా తహసీల్దార్ల సేవలు వినియోగించుకోనున్నారు. అధికారులు, సిబ్బంది, ఇంజినీర్లు, మానవవనరుల సంఖ్య భారీగా పెరగడం, యంత్రాల రవాణా, ఇతరత్రా అంశాలను దృష్టిలో ఉంచుకొని నిజామాబాద్ నియోజవర్గానికి అదనపు నిధులు కేటాయించనున్నారు. దాదాపు పది కోట్ల రూపాయల వ్యయం అవుతుందని అంచనా వేశారు. నూతన ఈవీఎంలపై ఓటర్లలో అవగాహన కల్పించే కార్యక్రమానికి ఇప్పటికే అధికారులు శ్రీకారం చుట్టారు.
ఇవీ చూడండి:కంటోన్మెంట్‌ను జీహెచ్ఎంసీ పరిధిలోకి తెస్తాం