తెలంగాణ

telangana

నిజామాబాద్​ ఎమ్మెల్సీ ఎన్నికలో తెరాస గెలుపు తథ్యం: కేటీఆర్

By

Published : Oct 6, 2020, 6:13 PM IST

Updated : Oct 6, 2020, 7:05 PM IST

నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాస పార్టీ విజయం ఖాయమని పార్టీ కార్యనిర్వహక అధ్యక్షుడు కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో మాజీ ఎంపీ కవితను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కుల, మతాల పేరిట చిచ్చు పెట్టే వారిని ప్రజాక్షేత్రంలో గులాబీ పార్టీ ఎదుర్కొంటుందని కేటీఆర్ స్పష్టం చేశారు.

Nizamabad Local Bodies MLC Election
నిజామాబాద్​ ఎమ్మెల్సీ ఎన్నిక

నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా తెరాస పార్టీ తరఫున పోటీ చేస్తున్న మాజీ ఎంపీ కల్వకుంట్ల కవితను భారీ మెజార్టీతో గెలిపించాలని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కోరారు. నిజామాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికలపై స్థానిక ప్రజాప్రతినిధులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర సమితి స్థాపించిన నాటి నుంచి నిజామాబాద్ జిల్లా.. తెలంగాణ చైతన్యాన్ని, పార్టీ నాయకత్వాన్ని బలోపేతం చేస్తూ వచ్చిందని అన్నారు. రెండు దశాబ్దాల క్రితం నిజామాబాద్ జిల్లాలోని మోతే గ్రామంలో ఏకగ్రీవ ఎన్నిక ద్వారా మొదటి గెలుపునిచ్చారని, ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికలోనూ అదే పంథా సాగించాలని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఆ ఘనత తెరాసదే

ఓవైపు ప్రాజెక్టులను నిర్వహిస్తూనే మరోవైపు వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు రైతుబంధు, రైతుబీమా వంటి కార్యక్రమాలను ప్రవేశపెట్టి నిరంతరం రైతుల క్షేమం కోసం తపిస్తున్న కేసీఆర్ తనయను గెలిపించాలని మంత్రి కేటీఆర్ కోరారు. జిల్లాకు సంబంధించి ఎస్సారెస్పీ ప్రాజెక్టు పునరుజ్జీవన కార్యక్రమం ద్వారా లక్షలాది ఎకరాలకు సాగునీరు అందించిన ఘనత తెరాస సర్కార్​దేనని గుర్తు చేశారు.

ప్రజల వద్దకే పరిపాలన.. తెరాస యోచన

నిజామాబాద్ జిల్లాలో ఉన్న వ్యవసాయ రంగ ఉత్పత్తులను దృష్టిలో పెట్టుకొని ప్రత్యేక ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లను ఏర్పాటు చేసి జిల్లాలోని యువతకు ఉపాధి కల్పించేందుకు ప్రయత్నం చేస్తున్నామని మంత్రి కేటీఆర్ తెలిపారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత నిజామాబాద్ జిల్లాలో నూతన జిల్లాను ఏర్పాటు చేసి, పదుల సంఖ్యలో నూతన గ్రామ పంచాయతీ, మండలాలు ఏర్పాటు చేశామని వెల్లడించారు. ఈ విధంగా ప్రజల వద్దకు పరిపాలన ఫలాలు అందేలా చర్యలు తీసుకున్నామని చెప్పారు.

ప్రజాక్షేత్రంలోనే మా యుద్ధం

ఇలా అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న తెరాస ప్రస్థానాన్ని చూసి ఓర్వలేక కొన్ని పార్టీలు అసూయతో రాజకీయాలు చేస్తున్నాయని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మండిపడ్డారు. అభివృద్ధిలో తమతో పోటీపడలేక ప్రతిపక్షాలు చేస్తున్న రాజకీయాలను ఎప్పటికప్పుడు ఎదుర్కొంటూ.. అన్ని ఎన్నికల్లో తెరాస ఘనవిజయం సాధిస్తూ వస్తోందని తెలిపారు. కుల, మతాల పేరుతో చిచ్చు పెట్టే పార్టీలను తెరాస పార్టీ ప్రజాక్షేత్రంలో ఎదుర్కొంటుందని స్పష్టం చేశారు.

గులాబీ పార్టీకే పట్టం కట్టండి

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు వ్యతిరేక బిల్లులను వ్యతిరేకించిన తెరాస.. విద్యుత్ సంస్కరణల పేరిట రైతులకు ఉచిత విద్యుత్​కు ప్రమాదం తీసుకువచ్చే కార్యక్రమాన్ని కూడా వ్యతిరేకిస్తోందని కేటీఆర్ స్పష్టం చేశారు. అన్ని రంగాల్లో ముందుకు తీసుకుపోతున్న తమ ప్రభుత్వ పనితీరుని అర్థం చేసుకొని, రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో కల్వకుంట్ల కవితను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. తెలంగాణ సాధించుకున్నాక వచ్చిన అన్ని ఎన్నికల మాదిరి.. నిజామాబాద్​ ప్రజల చొరవతో.. స్థానిక ప్రజాప్రతినిధుల కృషితో.. ఎమ్మెల్సీ ఎన్నికలోనూ గెలిచి గులాబీ పార్టీ తిరుగులేని రాజకీయ శక్తిగల పార్టీ అని మరోసారి నిరూపిస్తామని కేటీఆర్ అన్నారు.

Last Updated : Oct 6, 2020, 7:05 PM IST

ABOUT THE AUTHOR

...view details