D Srinivas Return to Congress: ధర్మపురి శ్రీనివాస్. ఇది పరిచయం అవసరం లేని పేరు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాతో పాటు రాష్ట్ర రాజకీయాల్లోనూ తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు డి.శ్రీనివాస్. దాదాపు 4 దశాబ్దాలకు పైగా రాజకీయ రంగంలో సుదీర్ఘ అనుభవం కలిగి వుండి రాష్ట్ర రాజకీయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రుల నియామకాల ప్రస్తావన వచ్చిన ప్రతిసారీ.. డీఎస్ పేరు ప్రముఖంగా తెరపైకి వచ్చేదంటే ఎంతటి ఉన్నత స్థాయికి ఎదిగారో అర్థం చేసుకోవచ్చు. సుమారు దశాబ్ద కాలం పాటు అధికారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్ పార్టీని తన సారథ్యంలో తిరిగి కుర్చీపై కూర్చోబెట్టిన ఘనతను దక్కించుకున్నారు. వరుసగా 2004, 2009 అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్‌ను అధికారంలోకి తేవడం ద్వారా జాతీయ నాయకత్వం దృష్టిని ఆకర్శించారు.
సొంత పార్టీ నేతలే నిందలేశారు..
D Srinivas Back in congress: 2014లో రాష్ట్ర ఆవిర్భావం తర్వాత అప్పటి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జి దిగ్విజయ్ సింగ్.. డీఎస్‌ను కాదని ఆయన శిష్యురాలైన ఆకుల లలితకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు. దీన్ని జీర్ణించుకోలేకపోయిన డీఎస్... కాంగ్రెస్ పార్టీని కాదని కేసీఆర్ సమక్షంలో తెరాసలో చేరారు. తనతో ఉన్న సాన్నిహిత్యంతో కేసీఆర్.. డీఎస్‌కు రాజ్యసభ సభ్యుడిగా అవకాశం కల్పించారు. అయితే ఈ సంతోషం కొన్నాళ్ల పాటే మిగిలింది. తెరాస పార్టీకి డీఎస్ వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని.. సొంత జిల్లాకు చెందిన నేతలు ఆయనపై నిందలు మోపారు. డీఎస్ రెండో కుమారుడు అర్వింద్ భాజపాలో చేరడం.. ఎంపీ అభ్యర్థిగా బరిలో నిలవడంతో స్థానిక తెరాస నేతలు మూకుమ్మడిగా తెరాస అధిష్ఠానానికి ఫిర్యాదు చేశారు. దీనిని సవాల్ చేస్తూ తన తప్పిదాలను నిరూపించాలని.. పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డీఎస్ పలుమార్లు డిమాండ్ చేశారు. ఇప్పటివరకు తెరాస నాయకత్వం ఆయనపై క్రమశిక్షణ చర్యలు చేపట్టలేకపోయింది. ఆయన తన పదవికి రాజీనామా చేయకుండా రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు. పదవీకాలం మరో మూడు నెలల్లో ముగియనుండటం.. ఇటీవల కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీని కలిసి పార్టీలో చేరబోతున్నట్లు ప్రకటించడం.. జిల్లా రాజకీయాల్లో ఆసక్తి రేపుతోంది.
కాంగ్రెస్‌లో చేరిక.. అందుకోసమేనా?