తెలంగాణ

telangana

ETV Bharat / state

TRS attack on MP Arvind : ఎంపీ అర్వింద్ వాహనంపై రాళ్లతో దాడి చేసిన తెరాస శ్రేణులు

MP Arvind
MP Arvind

By

Published : Jan 25, 2022, 3:24 PM IST

Updated : Jan 25, 2022, 7:20 PM IST

15:23 January 25

ఎంపీ అర్వింద్ వాహనంపై రాళ్లతో దాడి చేసిన తెరాస శ్రేణులు

ఎంపీ అర్వింద్ వాహనంపై రాళ్లతో దాడి చేసిన తెరాస శ్రేణులు

TRS attack on MP Arvind : నిజామాబాద్ జిల్లాలో ఎంపీ అర్వింద్ పర్యటన ఉద్రిక్తంగా మారింది. ఆర్మూర్ మండలం ఇస్సపల్లి వద్ద ఎంపీ అర్వింద్ వాహనంపై దాడి జరిగింది. కారు అద్దాలు ధ్వంసం అయ్యాయి. ఎంపీ వాహనంతోపాటు పలువురు నాయకులు, కార్యకర్తల వాహనాలు దాడిలో అద్దాలు ధ్వంసం కాగా.. పలువురు గాయపడ్డారు. ఐదారు వాహనాలతో పాటు ఆరుగురి కార్యకర్తల చేతులు, కాళ్లు, తలకు గాయాలయ్యాయి. పలువురికి చేతులు విరిగిపోయాయి. రాళ్లు, కత్తులతో దాడికి పాల్పడ్డారని... తెరాస కార్యకర్తలతో పోలీసులే దాడి చేయించారని ఎంపీ అర్వింద్​ ఆరోపించారు.

తెరాసకు అది వర్తించదా

నందిపేట మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఎంపీ అర్వింద్ పాల్గొనేందుకు వెళ్లారు. నందిపేట మండలం చిన్నయానాంలో ఎంపీ నిధులతో నిర్మించిన ప్రభుత్వ పాఠశాల ప్రహారీ గోడ, అన్నారంలో బస్ షెల్టర్​ను ఎంపీ అర్వింద్ ప్రారంభించాల్సి ఉంది. ఎంపీ రానున్నారన్న సమాచారంతో తెరాస తెరాస శ్రేణులు అడ్డుకునేందుకు సిద్ధమవగా.. అర్వింద్ పర్యటనకు పోలీసులు అనుమతి నిరాకరించారు. పోలీసుల వైఖరిని నిరసిస్తూ అర్వింద్ తన శ్రేణులతో కలిసి ఆర్మూర్ మండలం మామిడిపల్లి చౌరస్తాలో ధర్నా, రాస్తారోకో చేశారు. ఏదైనా ఆందోళన చేస్తామంటే భాజపా నేతలను హౌస్ అరెస్టే చేస్తారని.. తెరాసకు అది వర్తించదా అని ఎంపీ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ధర్నా చేశారు.

పోలీసులు తెరాసకు సహకరించారు

అనంతరం నందిపేట్ మండలంలో కార్యక్రమాలకు వెళ్లేందుకు బయల్దేరగా ఆర్మూర్ మండలం ఇస్సాపల్లి వద్ద దాడి జరిగింది. అధిక సంఖ్యలో ఎంపీ అర్వింద్ వాహనంతోపాటు ఇతర వాహనాలపై దాడి చేశారు. రాళ్లు, కర్రలతో దాడికి పాల్పడ్డారు. ఇరు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. ఘటన అనంతరం నేరుగా ఎంపీ అర్వింద్ పోలీస్ కమిషనర్ కార్యాలయానికి వచ్చారు. దాడి విషయంపై అదనపు డీసీపీ వినీత్​కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. తెరాస నేతలే తమ కార్యకర్తలతో దాడి చేయించారని ఎంపీ అర్వింద్ ఆరోపించారు. ఈ విషయంలో పోలీసులు తెరాసకు సహకరించారన్నారు. దాడి విషయంపై ముందే పోలీస్ కమిషనర్​కు తాను సమాచారం ఇచ్చానని.. వందల మంది గుడిగూడి కత్తులు, రాళ్లు, రాడ్లతో దాడి చేస్తారని తెలిసిందని చెప్పినా పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఈ దాడి చేయించారని ఆరోపించారు. జీవన్ రెడ్డిని వచ్చే ఎన్నికల్లో 50వేల మెజార్టీతో ఓడించి గుణపాఠం చెప్తానన్నారు.

పోలీసులు తెరాస తొత్తులుగా మారారు

'మమ్మల్ని అక్కడ ఉంచి ట్రాఫిక్​ క్లియర్​ చేస్తున్నామని చెప్పి పోలీసు వాళ్లే తెరాస వాళ్లను మేము ఉన్నచోటికి పిలిపించారు. రాళ్లు, కత్తులతో దాడి చేశారు. నా కారు అద్దాలు పలిగిపోయాయి. కత్తులతో దాడి చేశారు. ఇనుప గుండ్ల లాంటి వాటితో మా కార్యకర్తలను కొట్టారు. భాజపాని అటాక్​ చేయాలని పోలీసులను తెరాస వాడుకుంటోంది. పోలీసులు తెరాస తొత్తులుగా మారారు. ఫిర్యాదు చేయడానికి దాడి జరిగిన ఘటన నుంచి సీపీ ఆఫీస్​కు వచ్చా. ఇక్కడ ఒక్క అధికారి లేడు. సీపీ కూడా ఇందులో ఇన్వాల్వ్​ అయ్యాడు. సీపీ వింతగా ప్రవర్తిస్తున్నాడు. ఫోన్ చేస్తే... నేను ఏం చేయలేను సర్ అని అన్నాడు.'- అర్వింద్, నిజామాబాద్ ఎంపీ

దాడి ఘటనపై వారికి ఫిర్యాదు చేస్తా

దాడిలో గాయపడ్డ కార్యకర్తలు నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఎంపీ అర్వింద్​పై దాడి విషయం తెలుసుకున్న జిల్లా నేతలు, కార్యకర్తలు సీపీ కార్యాలయానికి తరలివచ్చారు. అనంతరం ఎంపీతో పాటు ఆయన నివాసానికి వెళ్లారు. ఘటన గురించి తెలిసిన రాష్ట్ర నేతలు, జాతీయ నాయకులు ఎంపీ అర్వింద్​ను ఫోన్​లో పరామర్శిస్తున్నారు. ఘటనపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అర్వింద్​కు ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు. బండి సంజయ్ ఫోన్​లో అర్వింద్​ను పరామర్శించారు. నేతలు రాజాసింగ్, డీకే అరుణ దాడిని ఖండించారు. ఘటనపై ప్రివిలేజ్ కమిటీ, కేంద్ర హోం శాఖకు ఫిర్యాదు చేస్తానని ఎంపీ అర్వింద్ స్పష్టం చేశారు.

ఇదీ చదవండి :అర్వింద్ పర్యటనకు అనుమతి నిరాకరణ... రోడ్డుపై బైఠాయించి ధర్నా

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

Last Updated : Jan 25, 2022, 7:20 PM IST

ABOUT THE AUTHOR

...view details