Revanthreddy on TSPSC Leakage Issue : రాష్ట్రవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్న టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీపై ప్రతిపక్షాలు ఆరోపణల వర్షం కురిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ వ్యవహారంపై సిట్ దర్యాప్తు వేగవంతం చేసింది. మరోవైపు బీజేపీ, కాంగ్రెస్ ఈ లీకేజీ కేసుపై అధికార పార్టీ హాస్తం ఉందంటూ విమర్శలు గుప్పిస్తున్నాయి. సిట్టింగ్ జడ్జి లేదా సీబీఐతో న్యాయ విచారణ చేయించాలని డిమాండ్ చేస్తున్నాయి. తాజాగా ఇదే వ్యవహారంపై పాదయాత్రలో భాగంగా నిజామాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మరోసారి తీవ్రస్థాయిలో ఆరోపణలు గుప్పించారు.
ఐటీ మంత్రి కింద టీఎస్‌టీఎస్ కార్పొరేషన్ పనిచేస్తోంది : ఐటీ శాఖ కింద టీఎస్‌టీఎస్ పనిచేస్తోందన్న రేవంత్.. కంప్యూటర్ల కొనుగోలు, నిర్వహణ టీఎస్‌టీఎస్ బాధ్యతే అని అన్నారు. ఐటీశాఖ అనుమతి తీసుకున్నాక కంప్యూటర్లు ఏర్పాటు చేస్తారన్నారు. టీఎస్‌టీఎస్ ఛైర్మన్ జగన్.. కేసీఆర్‌కు దగ్గరి బంధువని పేర్కొన్నారు. కేటీఆర్ ప్రతిపాదనతో టీఎస్‌టీఎస్ ఛైర్మన్‌ను సీఎం కేసీఆర్ నియమించారన్నారు. ఐటీ మంత్రి కింద టీఎస్‌టీఎస్ కార్పొరేషన్ పనిచేస్తోందని తెలిపారు. కంప్యూటర్ల ఔట్‌సోర్సింగ్ సిబ్బంది నియామకం కార్పొరేషన్ ద్వారా జరుగుతుందని రేవంత్ వ్యాఖ్యానించారు.
'ఔట్‌సోర్సింగ్ ఉద్యోగి రాజశేఖర్‌రెడ్డి 2017లో ఉద్యోగంలో చేరారు. 2021లో నియామకమైన నాకు ఘటనతో సంబంధమేంటని జగన్ వాదిస్తున్నారు. కేటీఆర్ వద్ద పనిచేసే తిరుపతి టీఎస్‌టీఎస్ శాఖపై ఒత్తిడి తెచ్చారు. మల్యాలకు చెందిన రాజశేఖర్‌రెడ్డిని తిరుపతి నియమించారు. 2017లో టీఎస్‌పీఎస్సీలో రాజశేఖర్‌రెడ్డిని నియమించారు. గతంలో టీఎస్‌పీఎస్సీ కార్యాలయాన్ని కేటీఆర్ సందర్శించారు. టీఎస్‌పీఎస్సీ కార్యాలయంలో కంప్యూటర్లు అప్‌గ్రేడ్ చేయాలని సూచించారు. కంప్యూటర్లను ఐటీశాఖ నుంచి ఏర్పాటు చేస్తామన్నారు.'-రేవంత్‌రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు