కేసీఆర్ ఏడేళ్ల పాలనలో నీటిపారుదల ప్రాజెక్టులు ఎందుకు పూర్తి చేయలేదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. హైదరాబాద్ కొంపల్లిలోని పీఎస్‌ఆర్ కన్వెన్షన్ హాల్లో బోధన్ నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో తెరాస ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. రూ.లక్షా 25 వేల కోట్లు ఖర్చు పెట్టినట్లు బిల్లులు చూపించి.. కల్వకుర్తి నుంచి శ్రీరాంసాగర్ వరకు ఏడేళ్లలో ఒక్క పని పూర్తి చేయలేదన్నారు. ప్రభుత్వం ఏర్పాటైన తొలి మూడేళ్లలోనే ప్రాజెక్టులు పూర్తి చేసి ఉంటే ఈరోజు ఏపీ ముఖ్యమంత్రి జగన్‌కు తెలంగాణపై ఫిర్యాదు చేసే అవకాశం వచ్చేది కాదు కదా అని అన్నారు. కమీషన్ల కోసం ప్రాజెక్టులను కాలగర్భంలో కలిపేశారని ఆరోపించారు. తెరాస పాలనలో రాష్ట్రంలోని ప్రాజెక్టుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందన్నారు.
ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని నాడు శాసనసభలో జానారెడ్డి రాష్ట్ర ప్రభుత్వానికి సూచించిన విషయాన్ని గుర్తుచేశారు. ఐదేళ్ల క్రితం జనారెడ్డి ఏ మాట చెప్పారో ఈ రోజు ఆ పరిస్థితులే ఉన్నాయని విమర్శించారు. అప్పుడే చివరి దశకు వచ్చిన ప్రాజెక్టులు పూర్తి చేసి ఉంటే ఇవాళ ఏపీ సీఎం జగన్ ఫిర్యాదు చేసే అవకాశం వచ్చేది కాదన్నారు. కేసీఆర్ కృష్ణా బోర్డు మీటింగ్‌కు ఎందుకు హాజరుకావడం లేదని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డి జలదొంగ అయితే.. పోతిరెడ్డిపాడు, సంగమేశ్వర, రాయలసీమ ఎత్తిపోతలపై బోర్డు సమావేశానికి వెళ్లి జగన్‌ను నిలదీయాలని కానీ ఎందుకు వెళ్లడం లేదన్నారు. తెరాస ఓటమి ఖాయమైంది కాబట్టే కేసీఆర్ ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టడానికి చూస్తున్నారని ఆరోపించారు.
జగన్‌తో అలయ్‌బలయ్ చేసుకుంది కేసీఆర్ కాదా అంటూ విమర్శించారు . వైసీపీ ఎమ్మెల్యే రోజా ఇంటికి వెళ్లి భోజనం చేసి.. రాయలసీమకు నీళ్లిస్తా అని చెప్పింది కేసీఆరే కదా అని మండిపడ్డారు. బేసిన్లు బేషజాలు లేవంటూ జగన్‌తో సఖ్యతగా సీఎం కేసీఆర్ మెలిగారంటూ రేవంత్ గుర్తు చేశారు. బేసిన్లు, బేషజాలు లేకుంటే ఇంతమంది తెలంగాణ సోదరుల ఆత్మబలిదానాలు ఎందుకు? రాష్ట్రం తెచ్చుకుందే నీళ్లు, నిధులు, నియామకాల కోసమే కదా అంటూ ప్రశ్నించారు. ఈ రోజు అదే నీటి విషయంలో అన్యాయం జరుగుతోందని రేవంత్ రెడ్డి అన్నారు.
బాబును విజయవాడలో కలిసి రాష్ట్ర పరిస్థితులు వివరించా. చంద్రబాబుకు నమస్కారం పెట్టి.. తెలంగాణ బిడ్డలు, రైతాంగం కన్నీళ్లలో మునిగితేలుతున్నారని.. కాబట్టి పార్టీని వీడటం తప్పలేదని గౌరవంగా పరిస్థితులను వివరించి కాంగ్రెస్‌లో చేరా. లబ్ధిపొందాలని అనుకుంటే ప్రతిపక్షమైనా కాంగ్రెస్ పార్టీలో ఎందుకు చేరతా? పార్టీ మారితే ఇష్టం వచ్చినట్లు మాట్లడలేను. కార్యకర్తల వల్లే ఇంతవాడిని అయ్యాను. రాష్ట్రానికి పట్టిన గులాబీ చీడ విరగడ కోసమే కాంగ్రెస్‌లో చేరా. సిరిసిల్లలో కేటీఆర్ గెలిచింది తెదేపా కార్యకర్తల సహకారంతోనే కదా. హైటెక్ సిటీ అభివృద్ధిని వివరిస్తూ చంద్రబాబును పోటీపడి పొగిడింది మీరేగా. చంద్రబాబును తిట్టాల్సిన అవసరం ఏముంది? - రేవంత్‌రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు.
చంద్రబాబును నువ్వెందుకు పొగిడినవ్.. కేటీఆర్ ఎట్ల గెలిచిండో మరిచినవా?
తెలంగాణలో చంద్రబాబుకు పార్టీ లేదు.. ప్రణాళిక లేదని రేవంత్‌రెడ్డి అన్నారు. తెలంగాణ ప్రజల కోసం పనిచేయడానికే తెదేపా నుంచి బయటకు వచ్చానని వివరించారు. రాజకీయం విలువను గౌరవిస్తున్నానన్న రేవంత్.. చంద్రబాబును ఎందుకు తిట్టాలని ప్రశ్నించారు. తిట్టలేదు కాబట్టి తనను బాబు మనిషి అంటున్నారని చెప్పుకొచ్చారు. తెలంగాణకు బద్ధ వ్యతిరేకి అని రాజశేఖరరెడ్డిని తిట్టి.. జగన్‌తో సఖ్యతగా ఉంది మీరు కాదా అని ప్రశ్నించారు. జగన్నుకు కాళేశ్వరం ప్రారంభోత్సవానికి సీఎం కేసీఆర్ ఆహ్వానించిన విషయాన్ని గుర్తుచేశారు.