Mangoes: వేసవి వచ్చిందంటే చాలు మామిడి పండ్ల రుచి చూడని వారుండరేమో.. ఇక మన పెరట్లో చెట్టు ఉంటే మాత్రం మనతో పాటు ఇరుగూపొరుగు, బంధువులకీ ఇక రోజూ మామిడి పండగే. మామిడి చెట్టుకు గుత్తులు గుత్తులుగా కాసిన కాయలను చూస్తుంటే ఎవరైనా సరే మనసు పారేసుకోవాల్సిందే.. వాటిని తెంపి ఆ రుచిని ఆస్వాదించాల్సిందే. ఒక చెట్టుకే గుత్తులు కాసిన మామిడి పండ్లను చూస్తే.. ఇలా అనిపిస్తే.. ఇక ఒక కొమ్మే నిత్యం మామిడి కాయల గుత్తులతో కళకళలాడుతుంటే.. తెంపడం అటుంచి ఇదెలా సాధ్యమా అని ఆలోచిస్తాం. నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం బోర్గంలో ఓ రైతు ఇంటి ఆవరణలో ఉన్న ఈ వింత అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.
మూడేళ్ల వయసున్న మామిడి మొక్క గుత్తులు గుత్తులుగా కాయలు కాసి అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ప్రత్యేకించి ఓ కొమ్మ వందకుపైగా కాయలతో ఆకట్టుకుంటోంది. బోర్గంలో పోశెట్టి అనే రైతు ఇంటి ఆవరణలో ఈ మొక్క ఉంది. ఈ ఏడాది వెయ్యికి పైగా కాయలు కాసింది. దీంతో రైతు పోశెట్టి ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాండం నుంచి కాపు రావడంతో ఈ మొక్క ఇలా గుత్తులుగా కాసిందని... దీన్ని కాల్‌ఫ్లోరస్ అని పిలుస్తారని ఉద్యానశాఖ అధికారులు తెలిపారు.