నిజామాబాద్ జిల్లా వర్ని మండలం తగిలేపల్లిలో తెల్లవారుజామున గంగామణి వాకిలి ఊడుద్దామని బయటకు వెళ్లారు. ఐదు నిమిషాలకే గోడ కూలిన శబ్ధం, కేకలు వినిపించాయి. చుట్టుపక్కల వాళ్లు వచ్చి శిథిలాల తొలగించారు. ఆమె కూతురు లక్ష్మీ, మనవడు అప్పటికే ప్రాణాలు కోల్పోయారు. ఆస్పత్రికి తరలిస్తుండగా లక్ష్మీ భర్త శ్రీను తుదిశ్వాస విడిచారు. ముగ్గురు ఆడపిల్లలకు తీవ్ర గాయాలు కాగా.. బోధన్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
పిల్లపాపలతో సంతోషంగా ఉన్న సమయంలో...
గాంధారి మండలం చద్మల్ తండాకు చెందిన శ్రీను వర్ని మండలం తగిలేపల్లికి చెందిన లక్ష్మిది ప్రేమ వివాహం. బంధువుల ఇంటి వద్ద కలిసిన వీళ్లిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. చద్మల్ తండా నుంచి తగిలేపల్లికి వచ్చి కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. శ్రీనివాస్, లక్ష్మీ దంపతులకు నలుగురు పిల్లలు. సంజన, అశ్విని, వైష్ణవి ముగ్గురు ఆడపిల్లలు కాగా.. కుమారుడు సాయివర్ధన్ ఏడాదిన్నర బాలుడు.
గోడ కూలి...
సొంతిళ్లు లేకపోవడంతో రేకుల ఇల్లు అద్దెకు తీసుకుని ఉంటున్నారు. క్రమంగా పగుళ్లు వచ్చి గోడ ఒకవైపు ఒంగిపోయి ప్రమాదకరంగా మారగా... ఇంటి వసారాలో పునాది లేకుండా చుట్టూ మట్టి గోడలు నిర్మించి రేకులు వేసి ఉంచారు. సోమవారం రోజు దానిలోకి మారాలనుకున్నారు. ఈ సమయంలోనే మృత్యువు.. గోడ రూపంలో ముగ్గురిని కబళించింది. దంపతులు శ్రీనివాస్, లక్ష్మీతోపాటు వారి ఏడాదిన్నర కుమారుడు సాయివర్ధన్ ప్రాణాలను బలితీసుకుంది. ఒకే కుటుంబంలో ముగ్గురు చనిపోవడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.