Sarangapur Pump House: 'సారంగపూర్ మునక' వెనుక పలు కోణాలివే..! - sarangapur pump house
నిజామాబాద్ జిల్లాలో నిర్మిస్తున్న సారంగపూర్ పంపుహౌస్ మునక ఘటనకు కారణాలను పలు కోణాల్లో విశ్లేషిస్తున్నారు. ఈనెల ఏడో తేదీ అర్ధరాత్రి పంపుహౌస్‌లోకి నీళ్లు వచ్చాయి. ‘సారంగపూర్ మునక’ వెనుక పలు కోణాలు ఏంటో కింది కథనం చదివి తెలుసుకుందాం.
Sarangapur Pump House
By
Published : Sep 14, 2021, 7:31 AM IST
కాళేశ్వరం ఎత్తిపోతల్లో భాగంగా నిజామాబాద్ జిల్లాలో నిర్మిస్తున్న సారంగపూర్ పంపుహౌస్ మునక ఘటనకు కారణాలను పలు కోణాల్లో విశ్లేషిస్తున్నారు. మరోవైపు నీటి తోడివేతకు సంబంధించిన ఏర్పాట్లపై ఆ శాఖ ప్రయత్నాలు ప్రారంభించింది.
ఈ నెల 6, 7 తేదీల్లో మహారాష్ట్రతోపాటు ఎస్సారెస్పీ పరీవాహకంలో భారీ వర్షాలు కురిశాయి. ఒక్కసారిగా వెనుక జలాల మట్టం పెరిగింది. ఏడో తేదీ అర్ధరాత్రి 12 గంటల నుంచి సర్జ్‌పూల్ నుంచి పంపుహౌస్‌లోకి నీళ్లు వస్తుండటాన్ని సిబ్బంది గుర్తించినట్లు తెలిసింది. 8న ఉదయం 10గంటలకల్లా పంప్‌హౌస్‌లో మోటార్లు కనిపించనంతగా నీళ్లు చేరాయి. దాదాపు 40 మీటర్ల స్థాయిలో నీళ్లు చేరి ఉంటాయని అంచనా.
ప్రాథమికంగా ఎయిర్ వెంట్‌లపైనే దృష్టి
సర్జ్‌పూల్ నుంచి డ్రాఫ్ట్ ట్యూబ్‌ల ద్వారా పంపులకు నీళ్లు వెళ్లే మార్గంలో చేరే గాలి బయటికి వెళ్లేందుకు ఎయిర్ వెంట్‌లను ఏర్పాటు చేశారు. ప్రతి గేటుపై 2ఎయిర్ వెంట్‌లు నిర్మించారు. ఎస్సారెస్పీ వెనుక జలాల మట్టం అనూహ్యంగా పెరగడంతో హెడ్‌రెగ్యులేటర్‌పై నుంచి సర్జ్‌పూల్‌కు చేరుకుని ఎయిర్ వెంట్‌ల ద్వారా పంపుహౌస్‌లోకి నీళ్లు వెళ్లి ఉంటాయని అంచనా వేస్తున్నారు.
మరోవైపు నీటి ఒత్తిడికి డ్రాఫ్ట్ ట్యూబ్‌లలో లీకేజీ ఏర్పడి ఉండొచ్చనే అభిప్రాయమూ ఉంది. సర్జ్‌పూల్ లైనింగ్ పనులు కొనసాగుతున్నప్పుడే సొరంగం నుంచి నీళ్లు వచ్చి చేరుతున్నట్లు గుర్తించారు. ఇటీవల వచ్చిన వరదతో మట్టం 334 మీటర్లకు చేరడంతోనే ఒత్తిడి పెరిగి ఉండొచ్చని ఇంజినీర్లు భావిస్తున్నారు. సారంగపూర్ పంపుహౌస్ నుంచి పూర్తి స్థాయిలో నీటి తోడివేతకు పది రోజుల సమయం పట్టే అవకాశాలు ఉన్నాయని ఎత్తిపోతల సలహాదారు పెంటారెడ్డి తెలిపారు. నీళ్లు చేరడానికి ఎయిర్ వెంట్‌లతోపాటు వరద ఒత్తిడి కారణమయ్యే అవకాశాలు ఉన్నాయని ఆయన ‘ఈనాడు - ఈటీవీ భారత్’కు వివరించారు.