Telangana University: తెలంగాణ విశ్వవిద్యాలయంలో చోటుచేసుకున్న పరిణామాలపై ఉన్నత స్థాయికి అందిన ఫిర్యాదులపై సర్కార్ చర్యలు చేపట్టింది. నిబంధనలు పాటించకుండా నియామకాలు, పదోన్నతుల తీరుపై ఆరోపణలు రావటమే కాకుండా, ఏడాదిన్నర కాలంగా పాలకమండలి భేటీ లేకపోవటం, బడ్జెట్ ఆమోదం లేకుండానే భారీ వ్యయాలు చేశారంటూ విమర్శలు వచ్చాయి. కొంతకాలంగా జరిపిన వివిధ కొనుగోళ్లలో అక్రమాలు జరిగాయంటూ ఈసీ సభ్యులు, విద్యార్ధి సంఘాలు ఫిర్యాదు చేశారు. ఈ పరిణామాల పర్యవసానంగా, ఇటీవల హైదరాబాద్ జరిగిన తెలంగాణ విశ్వవిద్యాలయం పాలక మండలి భేటీలో ఉన్నతాధికారులు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రిజిస్ట్రార్‌ను మార్చటమే కాకుండా, ఉపకులపతి నిర్ణయాలతో పూర్తిగా విభేదించారు.
నామమాత్రంగానే వీసీ నిర్ణయాలు: పాలనాపరమైన వ్యవహారాల పర్యవేక్షణకు ఉన్నతాధికారులు ఉపసంఘాన్ని ఏర్పాటు చేశారు. పూర్వ రిజిస్ట్రార్ ఆచార్య నసీంతో పాటు ఈసీ సభ్యులుగా ఉన్న రవీందర్‌రెడ్డి, వర్సిటీ ప్రిన్సిపల్ ఆరతి, రిజిస్ట్రార్‌గా బాధ్యతలు చేపట్టిన ఆచార్య యాదగిరి కలిసి బృందంగా పనిచేయాల్సి ఉంది. పాలనను గాడిలో పెట్టే చర్యల్లో భాగంగా ఈ ఉపసంఘం పాలనలో అవసరమైన నిర్ణయాలు తీసుకుని, వారానికోసారి పాలకమండలి ఎదుట ఉంచాలనేది ఆలోచనగా చెబుతున్నారు. ఇదే జరిగితే ఉపకులపతిగా ఉన్న రవీందర్ నిర్ణయాధికారాలు నామమాత్రం కావటమే కాకుండా ఆయన అధికారాలకు కత్తెర వేసినట్లేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.