Junior panchayat secretaries continue to protest : ఉద్యోగాలు క్రమబద్ధీకరించాలనే డిమాండ్‌తో సమ్మెబాట పట్టిన జూనియర్ పంచాయతీ కార్యదర్శులు మరోసారి ప్రభుత్వం ఆదేశాలను పట్టించుకోలేదు. ఇప్పటికే సోమవారం వరకు గడువు విధించిన సర్కార్.. మరో దఫా శనివారం మధ్యాహ్నం వరకు సమయం ఇచ్చింది. ఈలోగా విధుల్లో హాజరుకావాలని లేకుంటే.. వారి స్థానంలో కొత్తవారిని నియమిస్తామని ఆదేశాలు జారీచేసింది. అయినప్పటికీ.. జూనియర్ పంచాయతీ కార్యదర్శులు యథావిధిగా సమ్మెను కొనసాగించారు. 16వ రోజు వివిధ రూపాల్లో నిరసన వ్యక్తం చేశారు. న్యాయం జరిగే వరకు తమ పోరు కొనసాగుతుందని స్పష్టం చేశారు. మృతి చెందిన జూనియర్ పంచాయతీ కార్యదర్శి సోనికి నిరసన శిబిరాల్లో నివాళులు అర్పించారు.
వారిని తొలగిస్తే.. కేసీఆర్ ప్రభుత్వం పడిపోతుంది : నిర్మల్‌లో ప్రభుత్వం విధించిన గడువు దాటిందంటూ కార్యదర్శులు ప్లకార్డులు ప్రదర్శించారు. యాదాద్రి భువనగిరి కలెక్టరేట్ ముందు ధర్నాచౌక్ వద్ద ఒంటికాలిపై నిలబడి జేపీఎస్‌లు నిరసన వ్యక్తం చేశారు. నిజామాబాద్‌లో ధర్నాచౌక్ వద్ద తమ ఉద్యోగాలు పర్మినెంట్ చేయాలని నినాదించారు. జూనియర్ పంచాయతీ కార్యదర్శుల పట్ల కేసీఆర్ ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోందని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ మండిపడ్డారు. నాలుగేళ్లుగా వారితో పని చేయించుకొని ఇపుడు వారి బలవన్మరణానికి కారణమవుతున్నారని ఆరోపించారు. కరీంనగర్‌లో జేపీఎస్‌లకు ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి సంఘీభావం తెలిపారు. నిరసన శిబిరానికి వెళ్లిన ఆయన.. జూనియర్ పంచాయతీ కార్యదర్శులను ఉద్యోగాల నుంచి తొలగిస్తే.. కేసీఆర్ ప్రభుత్వమే పడిపోతుందని హెచ్చరించారు.
"మాలో చాలా మంది పెద్ద చదువులు చదివినా.. ప్రభుత్వం ఉద్యోగం అనే ధీమాతో చేరాం. ఇందులో మాకు భద్రత లేదు. మా సమస్యను ప్రభుత్వానికి చెబుతున్నాం. మేము ప్రభుత్వ ఉద్యోగులమే. మేము ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన చెయ్యలేదు. మాకు ఆరోగ్య భద్రత లేదు. ఇలాంటి సమస్యలను ముఖ్యమంత్రికి తెలియజేసేందుకే శాంతియుతంగా సమ్మె చేస్తున్నాం." -జూనియర్ పంచాయతీ కార్యదర్శి