నెలన్నర తర్వాత లిక్కర్ షాప్‌లు తెరవడంతో మద్యం ప్రియుల ఆనందానికి అంతు లేకుండాపోయింది. మండుటెండలో గంటల తరబడి మరీ క్యూలైన్లలో నిల్చొని మద్యం కొనుగోలు చేశారు. కొన్నిచోట్ల దుకాణాలు తెరిచే వరకూ చెప్పులు, ఇతర వస్తువులను వరుసలో ఉంచి మరీ మద్యం కోసం పోరుబాట పట్టారు. ప్రతి దుకాణం ముందు కిలోమీటర్ పైగా క్యూలైన్లలో ఎదురు చూశారు. క్రమశిక్షణ కలిగిన పౌరులుగా సామాజిక దూరం పాటిస్తూ, మాస్కులు ధరించి మద్యం కొనుగోలు చేశారు.
నిజామాబాద్ జిల్లాలో మొత్తం 91 దుకాణాలకుగానూ 87 తెరుచుకోగా... కామారెడ్డి జిల్లాలో 40 దుకాణాలకుగానూ 36 తెరిచారు. మిగిలిన దుకాణాలు అధికారులు సీజ్ చేయడంతో తెరుచుకోలేదు. కామారెడ్డి జిల్లా నిజాంసాగర్‌లో మాత్రం ఓ మద్యం దుకాణం స్టాక్ లేక తెరుచుకోలేదు. మద్యం దుకాణాలతో పాటు ప్రభుత్వం వెసులుబాటు కల్పించిన ఎలక్ట్రికల్, హార్డ్‌వేర్, స్టీల్, వ్యవసాయ సంబంధిత దుకాణాలు తెరుచుకున్నాయి.
లాక్డౌన్ సడలింపుల నేపథ్యంలో నిజామాబాద్ నగరంలో రోడ్లన్నీ రద్దీగా కనిపించాయి. అధిక శాతం జనాలు రోడ్లపైకి వచ్చారు. ఇక జిల్లావ్యాప్తంగా మద్యం దుకాణాల వద్ద రద్దీ కనిపిస్తే... బోధన్‌లో మాత్రం బ్యాంకుల వద్ద అధిక సంఖ్యలో ప్రజలు నగదు కోసం క్యూ కట్టారు. నిజామాబాద్ నగరంలో ఉదయం 6 గంటల నుంచే మద్యం కోసం ప్రజలు బారులు తీరారు. నగరంలోని శివాజీనగర్, వర్ని చౌరస్తా, నిఖిల్‌సాయి చౌరస్తా, కంఠేశ్వర్, దుబ్బ ప్రాంతాల్లో వైన్స్‌ల ముందు భారీ క్యూలైన్లు కనిపించాయి. ఈ ప్రాంతాల్లో మహిళలు సైతం మద్యం కొనుగోలు చేయడం విశేషం.