ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా వేల సంఖ్యలో కార్మికులు ఉన్నారు. నిజామాబాద్ జిల్లాలో 60వేలు, కామారెడ్డిలో 30వేల మంది నిర్మాణం రంగంతో ఉపాధి పొందుతున్నారు. ఇతర రాష్ట్రాలు, జిల్లాల నుంచి వలసొచ్చిన కూలీలు మరో 30వేల మంది వరకు ఉంటారని అంచనా. లాక్ డౌన్ సమయంలో యూపీ, బిహార్, ఏపీకి చెందిన వారిలో 25వేల మందికి పైగా స్వస్థలాలకు వెళ్లిపోయారు.
కూలీల కొరత..
అందులో కేవలం 5వేల మంది వరకే తిరిగి పనుల కోసం వచ్చారు. ఉభయ జిల్లాల్లో కలిపి 90వేల మంది కార్మికులు ఉన్నా... ఎక్కువ మంది కూలీలు, సహాయకులుగా మాత్రమే ఉన్నారు. దీంతో నైపుణ్యత కలిగిన కూలీల కొరత ఉంది. కరోనా కేసులు ప్రస్తుతం తీవ్రమవుతున్న నేపథ్యంలో స్థానిక కూలీలు, మేస్త్రీలు సైతం పనులకు వెళ్లాలంటే భయం పట్టుకుంటోంది.
ఆగిన పనులు..
నిజామాబాద్ లో రెండేళ్ల కిందట 100 లోపు ఉన్న అపార్టుమెంట్ల సంఖ్య ప్రస్తుతం 160కి చేరింది. నిర్మాణ దశలో మరో 50వరకు ఉన్నాయి. కూలీలు లేకపోవడం వల్ల నగరంలోని కంఠేశ్వర్, గంగాస్థానం ప్రాంతాల్లోనే 30కిపైగా అపార్టుమెంట్ల నిర్మాణం నిలిచిపోయాయి. ఏడాది రెండేళ్ల నుంచి అపార్టుమెంట్ల నిర్మాణం కోసం కోట్లు ఖర్చు చేసిన గుత్తేదార్లు.. పనులు ఆగిపోవడం వల్ల తీవ్రంగా నష్టపోతున్నారు. తెచ్చిన అప్పులకు వడ్డీ భారం అవుతోంది.