ప్రభుత్వ ఆస్పత్రుల్లో మూత్రపిండాల వ్యాధుల చికిత్సలో సూదిమందు కొరత ఏర్పడింది. డయాలసిస్ రోగులకు ఇచ్చే ఎరిథ్రోపాయిటిన్ ఇంజక్షన్ సరఫరా లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో నెలన్నర రోజులుగా సమస్య నెలకొంది. స్తోమత గల రోగులు సొంతంగా బయట నుంచి కొనుగోలు చేసి వాడుతున్నారు. మిగతా వారు దేవుడే దిక్కన్నట్లు రోజులు వెళ్లదీస్తున్నారు. ఈ విషయంపై గత సోమవారం డయాలసిస్ రోగులు నిజామాబాద్ జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. కామారెడ్డి, బాన్సువాడలోనూ ఇదే పరిస్థితి ఎదురవ్వగా.. ఆస్పత్రి నిధుల నుంచి వందేసి ఇంజక్షన్లు కొనుగోలు చేశారు. ఇవి కూడా వారం రోజుల్లో ఖాళీ అయ్యే దుస్థితి నెలకొంది.
ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఏర్పాటు చేసిన డయాలసిస్ కేంద్రాల నిర్వహణ ప్రైవేటు ఏజెన్సీలకు అప్పగించారు. అత్యవసర మందులను మాత్రమే సర్కారు సరఫరా చేస్తోంది. ఇందులో ఐరన్ ఇంజక్షన్ రోగికి నెలలో రెండు ఇస్తారు. వీరికి ఎరిథ్రో పాయిటన్ ఇంజక్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇవి నెలలో నాలుగు వరకు అవసరం అవుతాయి. అయితే ఎరిథ్రో పాయిటిన్ సరఫరా లేకపోవడంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. హైదరాబాద్ నుంచి సరఫరా లేకపోవడంతో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని డయాలసిస్ కేంద్రాలకు ఇంజక్షన్ సరఫరా నిలిచిపోయింది. మూత్ర పిండ వ్యాధుల్లో డయాలసిస్ దశకు చేరిన వారిలో రక్త హీనత ఏర్పడుతుంది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో డయాలసిస్ సేవలు ఉచితంగా అందుతున్నా ఇంజక్షన్ సరఫరా లేక ఇబ్బందులు ఏర్పడుతున్నాయని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు