ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్...! పరిశోధనల విభాగంలో భారతదేశంలోనే అత్యున్నత విశ్వవిద్యాలయం. బెంగళూరు కేంద్రంగా పరిశోధన అంశాల్లో సేవలందిస్తున్న ఈ సంస్థలో పీహెచ్‌డీ చేయటం అనేదే ఒక గౌరవంగా భావిస్తుంటారు విద్యార్థులు. ఆ అవకాశం కోసం ఎంతగానో ఎదురుచూస్తుంటారు. కానీ అత్యుత్తమ ప్రతిభ చూపిన అతికొద్ది మందికి మాత్రమే ఆ అదృష్టం దక్కుతోంది. అలాంటి అవకాశాన్ని సొంతం చేసుకున్నాడు...నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్‌కు చెందిన యువకుడు ప్రదీప్.
జిల్లాలోనే..
ఆర్మూర్‌కు చెందిన దోండి రవీందర్, రాజేశ్వరి దంపతులు ప్రభుత్వ ఉద్యోగులు. వీరికి ఇద్దరు కుమారులు.. ప్రణయ్, ప్రదీప్. ఉన్నత విద్యాభ్యాసం అంతా జిల్లాలోనే పూర్తి చేసిన ప్రదీప్... పదో తరగతిలో 9.5 జీపీఏ సాధించాడు. ఇంటర్లో ఎంపీసీ గ్రూప్‌లో చేరి 946 మార్కులు తెచ్చుకున్నాడు. ఉత్తర ప్రదేశ్‌లోని రాయబరేలిలో రాజీవ్ గాంధీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం టెక్నాలజీలో కెమికల్ ఇంజినీరింగ్ పూర్తి చేశాడు.
ఐఐఎస్సీలో అవకాశం
2019లో గేట్ పరీక్ష రాసి 2048 ర్యాంకు తెచ్చుకుని ఉత్తరాఖండ్ రూర్కీ ఐఐటీ నుంచి ఇటీవల ఎంటెక్ పట్టా ప్రదీప్ అందుకున్నాడు. పీహెచ్‌డీలో ప్రవేశం కోసం 2020లో గేట్ పరీక్ష రాయగా జాతీయ స్థాయిలో 610 ర్యాంకు వచ్చింది. 130 మందిని పీహెచ్‌డీ ప్రవేశాల కోసం మౌఖిక పరీక్షలకు పిలిస్తే.. కేవలం ఏడుగురు మాత్రమే ఎంపికయ్యారు. అందులో ప్రదీప్ రెండో స్థానంలో నిలిచి ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరులో సీటు దక్కించుకున్నాడు.