తెలంగాణ

telangana

ETV Bharat / state

Telangana Weather : ఎండలు బాబోయ్ ఎండలు.. తెగ మండిపోతున్నాయ్ - Telangana Weather Today

Telangana Weather Update : వేసవి ప్రారంభంలోనే ఎండలు మండుతున్నాయి. ఉష్ణ తాపం పెరగటంతో ఉదయం తొమ్మిది తరువాత జనాలు బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. వేసవి తీవ్రతను తట్టుకునేందుకు శీతల పానీయాలు, చల్లని పదార్థాల వైపు మొగ్గు చూపుతున్నారు. మరికొన్ని రోజులు అధిక ఉష్ణోగ్రతలు కొనసాగే అవకాశం ఉండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

heat
heat

By

Published : Apr 17, 2023, 8:33 AM IST

నిజమాబాద్​ జిల్లాలో భానుడి భగ.. భగ..

Telangana Weather Update : తెలంగాణలో భానుడు భగభగలతో ప్రజలను ముప్పుతిప్పలు పెడుతున్నాడు. ఓవైపు సూర్యతాపం.. మరోవైపు ఉక్కపోతతో జనం ఉక్కిరిబిక్కరి అవుతున్నారు. ముఖ్యంగా ఇందూరులో భానుడు భగభగలతో సెగలు కక్కుతున్నాడు. కొన్ని రోజులుగా రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నిజామాబాద్‌లో నమోదవుతున్నాయి. జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో 40 డిగ్రీలు దాటగా , మక్లూర్ మండలం లక్మాపూర్‌లో 44.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మెండోరా, ముప్కాల్‌, కమ్మర్‌ పల్లి, పెర్కిట్‌ తదితర ప్రాంతాల్లో 42 డిగ్రీలకు మించగా... మచ్చర్ల, వేంపల్లి, ఆలూర్‌ ప్రాంతాల్లో 41 డిగ్రీలకు పైగా రికార్డయ్యాయి. ఎండలు మరింత ముదురుతాయని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో మే మాసంలో పరిస్థితులు ఎలా ఉంటాయోనని ప్రజలు భయాందోళన చెందుతున్నారు.

Telangana Weather Today : తీవ్రమైన ఎండల ధాటికి వ్యవసాయ, ఉపాధి హామీ కూలీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉదయం తొమ్మిందింటికే ఎండలు మండుతుండటంతో బయటికి వెళ్లేందుకు జనం జంకుతున్నారు. అంగన్‌వాడీ, ప్రాథమిక పాఠశాల కేంద్రాల్లో చిన్నారుల కోసం ORS ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు వచ్చిన జనం... శీతల పానీయాలు, కొబ్బరి బోండాలు, పళ్ల రసాలను ఆశ్రయిస్తున్నారు. ఉక్కబోతకు ఉక్కిరిబిక్కిరవుతున్న ఉద్యోగులు, వ్యాపారులు ఫ్యాన్లు, కూలర్లు, ACల వాడకంతో కరెంటు వినియోగం 2 రెట్లు అధికమైంది. ఉష్ణ తాపాన్ని తట్టుకోలేక ప్రజలు బయటికి వచ్చేందుకు విముఖత చూపుతున్నారు.

Telangana Temperature Today : తీవ్రమైన ఎండల దృష్ట్యా వైద్య నిపుణులు పలు జాగ్రత్తలు సూచిస్తున్నారు. ఆరుబయట పనులు సాయంత్రం వేళల్లో చేసుకోవాలని....శరీరానికి వేడి తగలకుండా తెలుపు, కాటన్‌ వస్త్రాలు ధరించటం మేలని చెబుతున్నారు. ముఖ్యంగా తలకు టోపీ, రుమాలు చుట్టుకోవాలని సూచిస్తున్నారు. ఎండలో పనిచేసే కార్మికులు మంచి నీరు ‌అధికంగా తాగుతూ, ORS ప్యాకెట్లు అందుబాటులో ఉంచుకోవాలని వెల్లడించారు.

"ఎండలు విపరీతంగా కొడుతున్నాయి. పొద్దున పది దాటితే బయటకి రాలేము. ఏమైనా పనులు ఉంటే పదిలోపు చేసుకుంటున్నాము. రాబోయే మే నెలలో పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించడానికే భయంగా ఉంది.". - రమణ, స్థానికుడు

"ఉదయం పదకొండు దాటితే ఎండలకు భయపడి ప్రజలు బయటకు రావడం లేదు. సాయంత్రం అయిదు గంటల వరకు ఎండల తీవ్రత బాగా ఉంటోంది. మా టిఫిన్ సెంటర్​కు​ గిరాకీ తగ్గింది. ఉదయం మాత్రమే గిరాకీ ఉంటోంది. గిరాకీ లేక సాయంత్రం టిఫిన్ సెంటర్​ తీయడం లేదు." - గణేశ్‌, టిఫిన్​ సెంటర్​ నిర్వాహకుడు

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details