MP Arvind in Lok Sabha:రాష్ట్రంలో రైతుల పరిస్థితిపై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ లోక్‌సభలో ప్రస్తావించారు. రైతుల పరిస్థితిపై శూన్య గంటలో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో వరి ధాన్యం సేకరించట్లేదని లోక్‌సభలో ఆరోపించారు. ఆలస్యంగా కొనుగోళ్ల వల్ల రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని తెలిపారు. 2014-2020 వరకు సీఎం సొంత జిల్లాలో 416 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నట్లు వివరించారు.
arvind talk about paddy procurement: రాష్ట్ర ధాన్యం కొనబోమని కేంద్రం ఎప్పుడూ చెప్పలేదని పేర్కొన్నారు. 2020-21 నాటికి 3 రెట్లు అధికంగా ధాన్యం సేకరణ చేపట్టినట్లు వెల్లడించారు. పారాబాయిల్డ్ రైస్ సేకరణ తగ్గించాలని కేంద్రం కోరుతోందని తెలిపారు. కొందరు మిల్లర్లు ఇతర రాష్ట్రాల నుంచి బియ్యం తెస్తున్నారని మండిపడ్డారు. మిల్లర్లు బియ్యం రీసైకిల్ చేసి ఎఫ్‌సీఐకి అమ్ముతున్నారని అభిప్రాయం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కనుసన్నల్లోనే రైస్ మిల్లర్ల కుంభకోణం జరుగుతున్నట్లు ఆరోపించారు. బియ్యం కుంభకోణంపై కేంద్రం సమగ్ర దర్యాప్తు చేయాలని కోరారు.
తెలంగాణలో ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వ పాలనలో రైతుల పరిస్థితి దారుణంగా ఉంది. సకాలంలో ప్రభుత్వం వరి ధాన్యం సేకరణ చేయకపోవడంతో.. కొనుగోలు ఆలస్యం కావడంతో రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. 2014 నుంచి 2020 మధ్య కాలంలో ముఖ్యమంత్రి సొంత జిల్లాలోనే 416 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. గడచిన 5 సంవత్సరాలలో ఎఫ్సీఐ ద్వారా మొదట్లో 35.96 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసింది. 2020-21 నాటికి 3 రెట్లు అధికంగా 94.53 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ జరిగింది. గత కొన్ని రోజులుగా పార్లమెంట్ సంప్రదాయాలను ఉల్లంఘించి... సభను తప్పుదోవ పట్టించే విధంగా తెరాస ఎంపీలు గొడవ చేస్తున్నారు.