తెలంగాణ

telangana

ETV Bharat / state

TU VC vs EC Controversy : అంతా గందరగోళం.. @ తెలంగాణ విశ్వవిద్యాలయం

TU VC vs EC Controversy Latest Update : తెలంగాణ యూనివర్సిటీలో వీసీ వర్సెస్ ఈసీ వివాదం రోజురోజుకూ మరింత ముదురుతోంది. అసలు తమ రిజిస్ట్రార్ ఎవరో తెలియక ఉద్యోగులు, సిబ్బంది తలలు పట్టుకుంటున్నారు. మరోవైపు ఏప్రిల్ నెల వేతనాల కోసం వర్సిటీ పొరుగు సేవల ఉద్యోగులు ఆందోళనకు దిగారు.

TU
TU

By

Published : May 7, 2023, 8:26 AM IST

TU VC vs EC Controversy Latest Update : నిజామాబాద్ జిల్లాలోని తెలంగాణ విశ్వవిద్యాలయంలో వైస్‌ ఛాన్స్‌లర్‌(వీసీ) ఆచార్య రవీందర్‌, పాలక మండలి సభ్యులకు మధ్య నెలకొన్న వివాదంతో తీవ్ర గందరగోళం నెలకొంది. ఓయూ ప్రొఫెసర్‌ నిర్మలాదేవిని రిజిస్ట్రార్‌గా వీసీ నియమించగా, పాలకమండలి మాత్రం ఆచార్య యాదగిరి రిజిస్ట్రార్‌గా కొనసాగుతారంటూ శుక్రవారం హైదరాబాద్​లోని రూసా భవన్​లో జరిగిన సమావేశంలో తీర్మానించింది. దీంతో అసలు రిజిస్ట్రార్‌ ఎవరో తెలియక ఉద్యోగులు, సిబ్బంది తలలు పట్టుకుంటున్నారు.

ఇదిలా ఉంటే శనివారం ఉదయమే వర్సిటీకి వచ్చి ఆచార్య నిర్మలాదేవి రిజిస్ట్రార్‌ హోదాలో కూర్చున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన నిర్మలాదేవి.. తనను నియమిస్తూ వీసీ ఉత్తర్వులు ఇచ్చినందున, తన నియామకమే చెల్లుతుందని పేర్కొన్నారు. 90 రోజుల్లో పాలక మండలి అనుమతిని టీయూ వీసీ రవీందర్ గుప్తా తీసుకుంటారని పేర్కొన్నారు. అయితే పాలక మండలి తీర్మానించిన రిజిస్ట్రార్ ఆచార్య యాదగిరి వ్యక్తిగత పనుల కారణంగా వర్సిటీకి రాలేదు.

పరిపాలన భవనం ఎదుట ఉద్యోగుల బైఠాయింపు:మరోవైపు తెలంగాణ వర్సిటీలో పని చేస్తున్న పొరుగు సేవల ఉద్యోగులు ఏప్రిల్‌ నెల వేతనాల కోసం శనివారం ఆందోళనకు దిగారు. తమ జీతాలు ఎప్పుడు చెల్లిస్తారంటూ వీసీ రవీందర్‌, ఆచార్య నిర్మలాదేవిని ప్రశ్నించారు. ఇలాంటి దుస్థితి రాష్ట్రంలోని ఏ యూనివర్సిటీలో లేదని మండిపడ్డారు. అనంతరం పరిపాలన భవనం ఎదుట బైఠాయించి వీసీ రవీందర్ గుప్తాకు వ్యతిరేకంగా ఉద్యోగులు నినాదాలు చేశారు. జీతాలు సోమవారం జమ చేయిస్తానని వీసీ హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు. డ్రాయింగ్‌ అధికారిగా ఆచార్య నిర్మలాదేవి సంతకాలు చేసిన చెక్కులు చెల్లవని వర్సిటీ ఎస్‌బీఐ బ్యాంకు అధికారులు వీసీ ఆచార్య రవీందర్‌కు తెలిపారు. అయితే శుక్రవారం జరిగిన ఈసీ సమావేశ మినిట్స్‌ ప్రతుల్లో రిజిస్ట్రార్‌గా ఆచార్య యాదగిరి పేరుందని, ఆయన సంతకాలు చేస్తేనే వర్సిటీకి సంబంధించిన లావాదేవీలు కొనసాగుతాయని తేల్చి చెప్పారు.

పాలక మండలి గడువు పూర్తయింది:గత ఫిబ్రవరి నాటికి యూనివర్సిటీకి చెందిన పాలకమండలి(ఈసీ) మూడేళ్ల పదవీ కాలం ముగిసినందున ఎలాంటి సమావేశాలు అవసరం లేదని వీసీ ఆచార్య రవీందర్‌ అన్నారు. ప్రభుత్వం త్వరలోనే నూతన పాలక మండలిని ఏర్పాటు చేస్తుందన్నారు. ఈసీ ఒక వ్యవస్థ మాత్రమేనని, సర్వాధికారాలు మాత్రం వైస్‌ ఛాన్స్‌లర్‌కే ఉంటాయన్నారు. వీసీకి నచ్చిన వ్యక్తిని రిజిస్ట్రార్‌గా నియమించుకోవచ్చన్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details