Telangana University Sports Board Problems : విశ్వవిద్యాలయానికి 'స్పోర్ట్స్ బోర్డు' తప్పనిసరి. ఉన్నత విద్యతో సమానంగా ఆటలకు ప్రాధాన్యం ఇవ్వాలి. విద్యార్థుల్లో క్రీడా నైపుణ్యాలు పెంచుతూ.. స్పూర్తి పెంపొందించాలి. కానీ.. నిజామాబాద్ జిల్లాలో ఉన్న తెలంగాణ విశ్వవిద్యాలయంలో పరిస్థితి వేరేలా ఉంది. వర్సిటీ ఏర్పడి ఇన్నేళ్లు గడుస్తున్నా 'స్పోర్ట్స్ బోర్డు' లేదని విద్యార్థులు డిమాండ్ చేయగా ఎట్టకేలకు అధికారులు బోర్డు ఏర్పాటు చేశారు. బోర్డు ఏర్పాటు చేసి.. 20 నెలలు గడుస్తున్నా ఒక్క సమావేశం నిర్వహించలేదు.
No Funds For Telangana University Sports Board :ప్రతి వర్సిటీలో స్పోర్ట్స్ బోర్డుకు ప్రత్యేక బడ్జెట్ ఉంటుంది. ఉస్మానియా, కాకతీయ వర్సిటీల్లో ఏటా దాదాపు రూ. కోటి.... మహాత్మా గాంధీ, పాలమూరు వర్సిటీలు రూ. 40 లక్షల వరకు కేటాయిస్తున్నాయి. ఈ నిధులతో క్రీడా మైదానం అభివృద్ధి, పరికరాల కొనుగోలు, ప్రతి క్రీడాకారుడికి కిట్లు, రవాణా ఖర్చులు చెల్లిస్తారు. రాష్ట్రంలో మూడో పెద్ద వర్సిటీగా పేరున్న తెలంగాణ విశ్వవిద్యాలయంలో మాత్రం క్రీడలకు నిధులు ఇవ్వకపోవడం దురదృష్టకరం.
TU Students Problems : వర్సిటీ ఏర్పాటై పదహారేళ్లు అయినా... అభివృద్ధికి మాత్రం దూరం
యూనివర్సిటీ తరఫున ఇతర ప్రాంతాల్లో నిర్వహించే టోర్నీలకు వెళ్లే వారికి బడ్జెట్ లేదని చేతులు దులుపుకొంటున్న దుస్థితి నెలకొంది. స్పోర్ట్స్ సర్టిఫికెట్ వస్తే ఉన్నత చదువులు, ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రాధాన్యం ఉంటుందనే ఆశతో క్రీడాకారులే సొంతంగా ఖర్చులు భరిస్తూ టోర్నీలకు హాజరవుతున్నారు. 2006లో ఏర్పడిన తెలంగాణ యూనివర్సిటీలో కొద్ది నెలల క్రితంమే స్పోర్ట్స్ బోర్డు ఏర్పాటు చేశారు. కానీ ఆటలకు సంబంధించి ఏలాంటి సదుపాయాలను కల్పించడం లేదు. కనీసం రన్నింగ్ చేయడానికి ట్రాక్ సరిగ్గా లేదు.