తెలంగాణ

telangana

ETV Bharat / state

Telangana University ఏడాదిలో నలుగురు రిజిస్ట్రార్లు

Telangana University వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన తెలంగాణ విశ్వవిద్యాలయంలో మరోసారి అనూహ్య పరిణామం చోటు చేసుకొంది. ప్రస్తుత రిజిస్ట్రార్‌ ఆచార్య శివశంకర్‌ స్థానంలో తాత్కాలికంగా ఆచార్య విద్యావర్ధిణిని నియమిస్తూ వీసీ ఆచార్య రవీందర్‌ బుధవారం ఉత్తర్వులు ఇచ్చారు.

Telangana University ఏడాదిలో నలుగురు రిజిస్ట్రార్లు
Telangana University ఏడాదిలో నలుగురు రిజిస్ట్రార్లు

By

Published : Aug 18, 2022, 8:54 AM IST

Telangana University తెలంగాణ విశ్వవిద్యాలయంలో రిజిస్ట్రార్‌ నియామక ప్రక్రియ అపహాస్యం అవుతోంది. ఏడాది వ్యవధిలోనే ముగ్గురిని మార్చారు. బుధవారం కొత్తగా మరొకరిని నియమించారు. గతేడాది సెప్టెంబరు 1న ఆచార్య కనకయ్యను ఇన్‌ఛార్జి రిజిస్ట్రార్‌గా వీసీ రవీందర్‌గుప్తా నియమించారు. దీన్ని పాలకమండలి వ్యతిరేకించడంతో మరుసటి నెలలోనే ఆయనను తప్పించారు. అనంతరం కళాశాల విద్య కమిషనర్‌ నవీన్‌మిత్తల్‌ ఎంపిక చేసిన ఆచార్య యాదగిరికి బాధ్యతలు అప్పగించారు. వర్సిటీలో పరిణామాలను చూసి 40 రోజుల్లోనే ఆయన తప్పుకొన్నారు. దీంతో డిసెంబరు 10న ఆచార్య శివశంకర్‌ను ఇన్‌ఛార్జి రిజిస్ట్రార్‌గా ఉపకులపతి నియమించారు. ఈ నియామకానికి మూడు నెలల్లోగా పాలకమండలి సమావేశంలో ఆమోదం పొందాలి. లేకుంటే ఆ బాధ్యతల నుంచి తప్పిస్తారు.

అయితే గత 8 నెలలుగా వర్సిటీ పాలక మండలి సమావేశం జరగలేదు. దీంతో శివశంకర్‌ నియామకానికి ఆమోదం లభించలేదు. ఈ క్రమంలో అకడమిక్‌ ఆడిట్‌ సెల్‌ డైరెక్టర్‌గా ఉన్న ఆచార్య విద్యావర్ధినిని బుధవారం రిజిస్ట్రార్‌గా నియమిస్తూ వీసీ ఉత్తర్వులు జారీచేశారు. వర్సిటీలో ఉపకులపతికి.. పాలక మండలి సభ్యులకు మధ్య సయోధ్య ఉండటం లేదు. ఈ కారణంగానే సకాలంలో పాలక మండలి సమావేశాలు నిర్వహించటం లేదు. ఉపకులపతి తీసుకుంటున్న నిర్ణయాలను వారు బహిరంగంగానే వ్యతిరేకిస్తున్నారు.

ప్రధాన గేటు వద్ద విద్యార్థుల ధర్నా: విశ్వవిద్యాలయంలో సమస్యలు పరిష్కరించాలంటూ విద్యార్థులు రెండు రోజులుగా ఆందోళనలు చేస్తున్నారు. బుధవారం ప్రధాన గేటు వద్ద ధర్నా చేపట్టి బోధన, బోధనేతర సిబ్బంది లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారు. అనంతరం వీసీ నివాస భవనం వద్దకు చేరుకొని బైఠాయించారు. మెస్‌ ఛార్జీలు పెంచాలని, బాలికలకు నూతన వసతిగృహం నిర్మించాలని, వర్సిటీ ఆవరణలోని ఆరోగ్య కేంద్రంలో ఎంబీబీఎస్‌ వైద్యుడిని నియమించాలని, క్రీడలకు నిధులు విడుదల చేయాలని.. వీసీ, రిజిస్ట్రార్‌ వారంలో ఒకరోజు వసతిగృహంలో భోజనం చేయాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు. మాట్లాడేందుకు వచ్చిన వీసీతో విద్యార్థులు వాగ్వాదానికి దిగారు. తాము సమస్యలపై ధర్నా చేస్తుంటే.. రిజిస్ట్రార్‌ను ఎందుకు మార్చారని నిలదీశారు. సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని వీసీ హామీ ఇచ్చారు.

ABOUT THE AUTHOR

...view details