తెలంగాణ విశ్వవిద్యాలయం ఏర్పాటై పదమూడేళ్లయ్యింది. ఇక్కడ 26 కోర్సుల్లో విద్య అందుతోంది. ప్రధాన ప్రాంగణంతో పాటు భిక్కనూరులో దక్షిణ ప్రాంగణం కొనసాగుతోంది. కొత్త కోర్సులు మంజూరైనా ప్రారంభంలో జాప్యం కొనసాగుతూనే ఉంది. ప్రధాన ప్రాంగణానికి ఇంజినీరింగ్ కోర్సు మంజూరైనా ఏర్పాటు చేయటం లేదు. ఇక దక్షిణ ప్రాంగణంలో ఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌ఎం, హిస్టరీ, తెలుగు, సైకాలజీ, పొలిటికల్ సైన్స్, జువాలజీ కోర్సులకు అనుమతి లభించింది. ఇక్కడ భవనాల సదుపాయం ఉన్నా.. నాలుగు కోర్సులే కొనసాగిస్తున్నారు. న్యాక్ గుర్తింపుతో (రూసా రాష్ట్రీయ ఉచ్ఛతర అభియాన్) నిధులు రూ.20 కోట్లు మంజూరైనా తీసుకురావటంలో ఆలస్యమవుతోంది. పరీక్షల విభాగం, ఆర్ట్స్ అండ్ సైన్స్ విభాగాలతో పాటు ఆడిటోరియానికి ప్రత్యేకంగా ఏర్పాట్లకు గతంలో నిధులు మంజూరైనా ఆచరణలో ముందడుగు పడటంలేదు.
పరిపాలనాంశాల్లో వైఫల్యాలు
ఉద్యోగుల సమయపాలనపై నియంత్రణ లేకపోవటంతో ఎవరు ఎప్పుడొస్తున్నారో తెలియని పరిస్థితి. ఇక్కడ బయోమెట్రిక్ విధానంలో హాజరు అమల్లో ఉన్నా.. దీనిని పరిగణనలోకి తీసుకోవడం లేదు. విధులకు హాజరు కాని కొందరు వారానికొకరోజు వచ్చి రిజిష్టర్‌లో సంతకాలు చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. దీనంతటికీ కారణం వీరిని పర్యవేక్షించాల్సిన పోస్టుల్లో ఉన్నవారు సైతం ఇదే మార్గాన్ని అనుసరిస్తుండటంతో ప్రశ్నించేవారు లేకుండా పోయారు. ఇక కొన్ని పోస్టుల్లో రాజకీయ పలుకుబడితో వచ్చిన వారు ఉండి, తమ పెత్తనాన్ని యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు. వీరిలో ఒకరిద్దరి అర్హతల విషయంలో లోపాలున్నాయని పలుమార్లు విచారణల్లో తేలినా తమ పోస్టుకు ఎసరు రాకుండా జాగ్రత్త పడ్డారు.
పరిశోధనలకు ఏది అవకాశం?
పరిశోధన విభాగంలోని విద్యార్థులకు సరైన సౌకర్యాల్లేవు. సైన్స్ విభాగంలో పరికరాలు అందుబాటులో లేక ప్రమాణాలు దెబ్బతింటున్నాయి. వర్సిటీకి చెందిన అధ్యాపకులు డాక్టర్ బాలకిషన్, డాక్టర్ ప్రవీణ్, శిరీష, శ్రీనివాస్‌లకు యూజీసీ, ఇతర ఫెలోషిప్‌లు వచ్ఛి. రూ.లక్షల్లో నిధులు మంజూరైనా ఇక్కడ పరిశోధనలు కొనసాగించే వెసులుబాటు లేకుండాపోయింది.