Yasangi paddy cultivation: ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో యాసంగిలో ధాన్యం కొనుగోళ్లపై నెలకొన్న అనిశ్చితి... సాగుపై ప్రభావం చూపుతోంది. వరినాట్లు వేసే విషయంలో సొంత భూమి ఉన్న రైతులు ఆచితూచి ధైర్యం చేస్తుంటే.. కౌలుదారులు వెనుకంజ వేస్తున్నారు. తమ పొలాలు పడావుగా మారే ప్రమాదం ఉందని గ్రహించిన యజమానులు.. ధరలు తగ్గించేందుకు అంగీకరిస్తున్నారు. ఇప్పటికే పంట పెట్టుబడి విపరీతంగా పెరిగి.. తెగుళ్ల బెడదతో ఖర్చు తడిసి మోపెడవుతోంది. దీంతో కౌలురైతులు ఈ యాసంగిలో సాగుకు అంతగా ముందుకు రావడం లేదు.
వెనుకంజ వేస్తున్న కౌలు రైతులు
మెట్ట ప్రాంతాల్లో ఆరుతడి పంటలు వేయాలని అధికారులు చెబుతున్నారు. అయితే ఆరుతడి పంటల విత్తన లభ్యతపై స్పష్టతనివ్వడం లేదు. దీంతో సొంత పొలం ఉన్న రైతులు ఆచితూచి సాగుకు సమాయత్తం అవుతున్నారు. కౌలు రైతులు మాత్రం వెనుకంజ వేస్తున్నారు. దీంతో ఒప్పందాలు ముందుకు సాగడం లేదు. యాసంగిలో వరి కొనుగోలు కేంద్రాలు ఉండవని.. రాష్ట్రప్రభుత్వం కూడా స్పష్టం చేసింది. ఇలాంటి పరిస్థితుల్లో భూములను కౌలుకు తీసుకుని.. సాగు చేస్తే శ్రమ వృథా అవుతుంది తప్ప లాభం ఉండదని కౌలు రైతులు భావిస్తున్నారు. ఒకవేళ ప్రభుత్వం కొనకుంటే దళారులకు అడిగినంతకు ఇవ్వాల్సి ఉంటుందని.. అలాంటప్పుడు కౌలుకు దూరంగా ఉండటమే మేలన్న అభిప్రాయం రైతుల్లో వ్యక్తం అవుతోంది.