Farmers Protest in Telangana : రైతులను అకాల వర్షం వెంటాడుతోంది. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్, జమ్మికుంట, వీణవంక, ఇల్లందకుంట మండలాల్లో వానకు ధాన్యం తడిసింది. జమ్మికుంట వ్యవసాయ మార్కెట్‌లో 5 వేల క్వింటాళ్ల వరకు ధాన్యం నీటిపాలైంది. తూకం వేసి రవాణాకు సిద్ధంగా ఉన్న మూడు ట్రాక్టర్ల ధాన్యం తడవడంతో.. రైతులు ఆందోళనకు గురవుతున్నారు. పెద్దపెల్లి జిల్లా మంథని, ముత్తారం, రామగిరి మండలాల్లో వర్షానికి కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడిసింది.
"మంత్రులు, సీఎం తడిసిన ధాన్యం కొనుగోలు చేస్తాం.. రైతులు బాధపడకండి అంటున్నారు. కానీ ఇక్కడ ఆ పరిస్థితి లేదు. మిల్లర్లు తడిసిన ధాన్యం, మొలకలు వచ్చిన ధాన్యం పేరుతో చాలా ఎక్కువ మొత్తంలో కటింగ్ చేస్తున్నారు. తరుగు లేకుండా తగిన ధరను ప్రకటించాలి. అకాల వర్షాలతో నష్ట పోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి. నెల రోజుల నుంచి చాలా ఇబ్బంది పడుతున్నాం".- రైతులు
మంథని మార్కెట్ యార్డులో ఆరబోసిన వడ్లు నీటి పాలయ్యాయి. కొనుగోళ్లలో వేగం పెంచి తడిసిన వడ్లనూ కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేశారు. అకాల వర్షం దెబ్బకు పొలాల్లో పంట నష్టపోయిన రైతులు శ్రమకోర్చి తెచ్చిన ధాన్యం అమ్ముకునేందుకు రైతులకు అవస్థలు తప్పడం లేదు. కొనుగోళ్లలో వేగం పెంచాలని డిమాండ్ చేస్తూ పలు జిల్లాల్లో రైతులు రోడ్డెక్కారు. నిజామాబాద్ జిల్లా తానాఖుర్దులో మొలకెత్తిన ధాన్యంతో రోడ్డుపై బైఠాయించారు. ఐకేపీ కేంద్రాలకు వడ్లు తరలించి నెల దాటినా కాంటా వేయట్లేదని మహబూబాబాద్ జిల్లా అమ్మపురలో రోడ్డుపై ముళ్ల కంచెతో నిరసన తెలిపారు.