Rain in nizamabad: నిజామాబాద్లో జిల్లాలో కురిసిన అకాల వర్షం అన్నదాతలకు తీరని నష్టం కలిగించింది. ఒక్కసారిగా వర్షం కురవడంతో ధాన్యం మొత్తం తడిసిపోయింది. నాలుగు నెలలుగా కష్టపడి పండించిన ధాన్యాన్ని కాపాడుకునేందుకు రైతన్నలు శ్రమించినా లాభం లేకుండాపోయింది. వారం రోజులుగా అరబెట్టిన ధాన్యం తడిసిపోవడంతో అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామీణ నియోజకవర్గంలోని సిరికొండ, ధర్పల్లి, ఇందల్వాయి మండలాల్లో కురిసిన అకాల వర్షానికి కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడిసి ముద్దయింది.
ధాన్యం కొనుగోళ్ల విషయంలో ప్రభుత్వ విధాన పరమైన నిర్ణయం ఆలస్యం కావడంతో నిల్వలు భారీగా పేరుకుపోయాయని రైతులు ఆరోపించారు. దీనికి తోడు కేంద్రాల్లో టార్పాలిన్లు అందుబాటులో లేకపోవడంతో సొంతంగా సమకూర్చుకోవాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. వేసవికాలం కావడంతో వర్షం నుంచి రక్షణ ఏర్పాట్లు చేసుకోలేదని తెలిపారు. వర్షానికి ఈదురుగాలులు కూడా తోడవడంతో పొలాల్లో పంట నెలకొరిగింది. సిరికొండ మండలం కొండాపూర్, ముషీర్ నగర్, ధర్పల్లి మండలం హొన్నజీ పేట్, వాడి గ్రామాల్లో పొలాల్లో పంట నేలకొరగడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కొనుగోళ్లు వేగంగా పూర్తిచేయాలని అన్నదాతలు కోరుతున్నారు.
ఇవీ చూడండి:వికారాబాద్లో జిల్లాలో అకాల వర్షం.. కొట్టుకుపోయిన కూరగాయలు