No Sports Facilities In Telangana University: ప్రతి యూనివర్సిటీకి స్పోర్ట్స్ బోర్డు తప్పనిసరిగా ఉండాలి. ఆ బోర్డు ద్వారా విద్యార్థుల్లో క్రీడా నైపుణ్యం పెంచి.. స్ఫూర్తి నింపే కార్యకలాపాలు కొనసాగించాల్సి ఉంటుంది. నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లిలోని తెలంగాణ విశ్వవిద్యాలయం ఏర్పడి 16 ఏళ్లు గడిచిపోయిన తర్వాత స్పోర్ట్స్ బోర్డు ఏర్పాటు చేశారు. బోర్డు అందుబాటులోకి వచ్చి 10 నెలల పైనే అవుతున్నా.. ఒక్క సమావేశమైనా జరగలేదు. క్రీడల అభివృద్ధికి ఎలాంటి కార్యకలాపాలు నిర్వహించలేదు. ఇటీవల విద్యార్థుల ఆందోళనలతో డైరెక్టర్‌ను మార్చడం తప్ప ఎలాంటి పురోగతి లేదు.
యూజీసీ నిబంధనల ప్రకారం 20 నుంచి 30 ఎకరాల్లో క్రీడా మైదానాలు ఉండాలి. తెలంగాణ విశ్వవిద్యాలయం 577 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నప్పటికీ.. ఒక్క మైదానం కూడా యూజీసీ నిబంధనల ప్రకారం లేకపోవడం దురదృష్టకరం. మామూలు మైదానమే క్రీడాకారులకు దిక్కయింది. స్టేడియం, జిమ్, క్రీడా పరికరాలు సమకూర్చాలని ఉన్నతాధికారులతో మొర పెట్టుకుని విద్యార్థులు అలిసిపోయారు.
Telangana University In Nizamabad: తెలంగాణ యూనివర్సిటీకి ఒకే ఒక్క ఫిజికల్ డైరెక్టర్ దిక్కయ్యారు. ఆ ఒక్కరూ ఒప్పంద పద్ధతిలో నియామకం అయ్యారు. అమ్మాయిలకు క్రీడల్లో ప్రోత్సాహం లేదు. గేమ్స్ ఇంఛార్జ్‌గా ఫిజికల్ ఎడ్యుకేషన్‌కు సంబంధించిన అధికారే ఉండాల్సి ఉండగా.. ఇక్కడ మాత్రం అధ్యాపకులు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. విద్యార్థులు ఆందోళన చేసినప్పుడే క్రీడా వసతులు, పరికరాల గురించి హామీలిచ్చి చేతులు దులుపుకుంటున్నారు. తెలంగాణ విశ్వవిద్యాలయంలో బీపెడ్ కోర్సును అందుబాటులోకి తేవాలని.. అలాగైనా కనీసం వర్సిటీ మైదానం అభివృద్ధి చెందుతుందని విద్యార్థులు అభిప్రాయపడుతున్నారు.