తెలంగాణ

telangana

ETV Bharat / state

Sriram sagar Project: ఎస్సారెస్పీలో నిత్యం జలకళ ఉండేలా ప్రభుత్వం చర్యలు

Sriram sagar Project: శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నిండాలంటే ఎగువన మహారాష్ట్రలో వర్షాలు సమృద్ధిగా కురవాలి. అక్కడి నుంచి వరద వస్తేనే ప్రాజెక్టుకు జలకళ. వానాకాలంలోనూ సకాలంలో నీరు రాకపోవడంతో ఆయకట్టు ప్రశ్నార్థకంగా మారింది. రాష్ట్ర ప్రభుత్వ జలాశయంలో అన్ని కాలాల్లో నీరుండేలా ఎస్సారెస్పీ పునరుజ్జీవన పథకం తెచ్చింది. కాళేశ్వరం నీటిని వరద కాలువ ద్వారా శ్రీరాంసాగర్ నింపేందుకు ముప్కాల్ వద్ద నిర్మిస్తున్న రివర్స్ పంపింగ్ పనులు పూర్తయ్యాయి. ప్రారంభోత్సవం కోసం తుది మెరుగులు అద్దుకుంటోంది.

Sriram sagar Project: ఎస్సారెస్పీలో నిత్యం జలకళ ఉండేలా ప్రభుత్వం చర్యలు
Sriram sagar Project: ఎస్సారెస్పీలో నిత్యం జలకళ ఉండేలా ప్రభుత్వం చర్యలు

By

Published : May 21, 2022, 5:26 AM IST

ఎస్సారెస్పీలో నిత్యం జలకళ ఉండేలా ప్రభుత్వం చర్యలు

Sriram sagar Project: ఎగువ నుంచి ఎస్సారెస్పీకి వరద రానప్పుడు 250కిలోమీటర్ల దూరంలోని కాళేశ్వరం వద్ద నుంచి గోదావరి నీటిని వెనక్కి పంపింగ్ చేసి వరద కాలువ ద్వారా నీటిని శ్రీరాంసాగర్‌కు మళ్లించాలనే లక్ష్యంతో ఎస్సారెస్పీ పునరుజ్జీవన పథకాన్ని 2017లో ప్రభుత్వం ప్రారంభించింది. రూ.1067 కోట్లతో పని ప్రారంభించగా పూర్తయ్యే నాటికి రెండువేల కోట్లకు చేరింది. వానాకాలం, యాసంగిలో 14లక్షల ఎకరాలకు కాకతీయ, సరస్వతి, లక్ష్మీ కాల్వల ద్వారా నిజామాబాద్, ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్, నల్గొండ జిల్లాలకు సాగునీరు అందించాలన్నది ఆ పథకం లక్ష్యం. ఇందులో భాగంగా ముప్కాల్ వద్ద కాల్వలో నుంచి నీటిని ప్రాజెక్టులోకి ఎత్తిపోసేందుకు మూడో పంపుహౌజ్ నిర్మించారు. పనులు పూర్తవడంపై సంతోషం వ్యక్తం చేస్తున్న రైతులు రెండు పంటలకు నీటికి ఢోకా ఉండదని.. ప్రాజెక్టులో నీరు నిత్యం ఉంటుందని చెబుతున్నారు.

అవసరం మేరకు రోజుకు ఒక టీఎంసీ చొప్పున 60 టీఎంసీల నీటిని కాళేశ్వరం నుంచి ఎస్సారెస్పీకి తరలించేలా ప్రణాళిక రూపొందించారు. తద్వారా జులైలోనే ఆయకట్టుకు నీరు వదిలేందుకు వీలు ఏర్పడుతుంది. రాంపూర్, రాజేశ్వరరావుపేట పంపుహౌజ్‌లు ఇప్పటికే పూర్తి కాగా.. ప్రయోగాత్మకంగా రివర్స్ పంపింగ్‌ ద్వారా ముప్కాల్ వరకు నీరు వచ్చింది. ప్రస్తుతం ముప్కాల్ పంపుహౌజ్ పనులు పూర్తి కావడంతో నేరుగా ప్రాజెక్టులోకి నీటిని ఎత్తిపోయనున్నారు. పంపుహౌజ్ ట్రయల్ రన్‌కి అధికారులు సిద్ధంగా ఉన్నారు. ఈ వానాకాలంలో కాళేశ్వరం నీటిని ఆయకట్టుకు అందించేందుకు పునరుజ్జీవన పథకం సిద్ధమైంది. వరద కాల్వలో ఏడాదిపొడువునా నీరు నిల్వ ఉండనుంది. తద్వారా చెరువులు, కుంటలు నింపుకునే అవకాశం సహా భూగర్భ జలాలు పెరగనున్నాయి. ప్రాజెక్టు నిండుగా ఉంటే మత్స్యకారులకు లాభం చేకూరుతుందని రైతులు అంటున్నారు.

పునరుజ్జీవన పథకం పూర్తి కావడంతో ఏ సీజన్‌లో చూసినా నీరు సమృద్ధిగా ఉంటుందన్న కర్షకులు.. వర్షాల కోసం మబ్బుల వైపు చూసే పని లేకుండా పోయిందని అంటున్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details