గత మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు రాష్ట్రవ్యాప్తంగా జలాశయాలకు భారీగా వరద వచ్చి చేరుతోంది. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ప్రాజెక్టులు నిండుకుండల్లా మారడంతో అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
నిజామాబాద్ జిల్లాలో
నిజామాబాద్ జిల్లా గోదావరి పరీవాహకంలో శ్రీరామసాగర్ ప్రాజెక్టు వేగంగా నిండుతోంది. ప్రస్తుతం ఎస్సారెస్పీకి 75,090 క్యూసెక్కుల వరద వస్తోంది. ప్రాజెక్టు నిల్వ సామర్థ్యం 90.31 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 60 టీఎంసీల మేర నీరు నిల్వ ఉంది. జలాశయంలో 1079.80 అడుగులకు నీటి మట్టం చేరుకుంది. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. జలాశయం నిల్వ సామర్థ్యం 20.18 టీఎంసీలకు గాను ఇప్పటికే 18.09 టీఎంసీలకు చేరుకుంది. 19.50 టీఎంసీలకు నీరు చేరితే గేట్లు తెరిచే అవకాశాలున్నట్లు ప్రాజెక్టు వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం కడెంతో పాటు ఎగువ నుంచి 12,123 క్యూసెక్కుల వరద వస్తోంది.
సూర్యాపేట జిల్లాలో
సూర్యాపేట జిల్లాలో మూసీ నదికి వరద ప్రవాహం భారీగా చేరుతోంది. ప్రాజెక్టు ఇన్ఫ్లో 6 వేల క్యూసెక్కులు కాగా, అవుట్ ఫ్లో 4,200గా కొనసాగుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 645 అడుగులు కాగా.. ప్రస్తుత నీటి మట్టం 642 అడుగులకు చేరుకుంది. అధికారులు ప్రాజెక్టు 6 క్రస్ట్ గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. మూసీ నది పరివాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ భాస్కరన్ సూచించారు.