Maclure Nursing College problems: రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల మాక్లూర్ శివారులో రూ.17.85 కోట్ల రూపాయలతో నర్సింగ్ కళాశాలను నిర్మించింది. వసతి గృహం సైతం ఏర్పాటు చేసింది. ఈ ఏడాది జూన్ 13న తరగతులు ప్రారంభించింది. తమ భవితకు బంగారు బాటలు వేసుకోవాలనే ఉద్దేశంతో.. 92 మంది విద్యార్థులు అందులో చేరారు. ప్రస్తుతం 67 మంది వసతిగృహంలో ఉంటున్నారు. వార్డెన్‌తోపాటు ఇద్దరు వంట మనుషులు, ఇద్దరు సహాయకులు, అక్కడ పని చేయాల్సి ఉండగా ఇప్పటి వరకు.. ఒక్కరినీ నియమించలేదు.
దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో విద్యార్థినులే నెలకు రూ.13 వేల 500 రూపాయలు చెల్లిస్తూ ప్రైవేటు వంట మనిషిని నియమించుకున్నారు. నిత్యం విద్యార్థినులే కూరగాయలు తరిగిస్తూ ఆమెకు సహకరించాల్సిన పరిస్థితి నెలకొంది. వంట మనిషి రాకుంటే.. వంతులవారీగా వంట సైతం చేసుకోవాల్సి వస్తోంది. ఇక అటెండర్లు లేకపోవడంతో పడక, స్నానాల గదులు వారే శుభ్రం చేసుకుంటున్నారు. ఒక వైపు పాములు, అడవి పందుల భయంతో గజగజ వణుకుతూ.. మరోవైపు బోధకులు లేక పాఠాలు సాగక సతమతమవుతున్నారు.
సరైన ఆహారం అందక ఇబ్బంది పడుతున్నారు. ఒక స్టాఫ్ నర్సుకే.. ఇంఛార్జి ప్రిన్సిపల్‌గా బాధ్యతలు అప్పగించిన అధికారులు.. అటు వైపు కన్నెత్తి చూడటం లేదు. కొత్త భవనం నిర్మించినా సిబ్బంది నియామకం లేక అవస్థలు తప్పడం లేదు. ఫర్నీచర్ సైతం సమకూర్చలేదు. దీంతో కింద కూర్చునే పిల్లలు పాఠాలు వినాల్సి వస్తోంది. అలాగే మంచాలు లేక రాత్రివేళ కిందనే నిద్రించాల్సిన పరిస్థితి ఉంది. చలి కాలం కావడంతో గజగజా వణకాల్సి వస్తోంది.
భవనం గుట్టల మధ్య అటవీ ప్రాంతం సమీపంలో ఉండటంతో నిత్యం భయం గుప్పిట్లో చదువుకుంటున్నారు. ఇప్పటికే పలువురు అధికారులు కళాశాలకు వచ్చి సమస్యలపై ఆరా తీసినా.. పరిష్కారం కాలేదని అంటున్నారు. బోధన, బోధనేతర సిబ్బందిని.. వంటమనుషులను తక్షణం నియమించాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. ఉన్నతాధికారులు ఇప్పటికైనా నర్సింగ్ పాఠశాలలో సమస్యలపై దృష్టిసారించి వెంటనే పరిష్కరించాలని.. విద్యార్థులు కోరుతున్నారు.