తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఆకలి కష్టాలు చూసి... పేదల కడుపు నింపుతోంది' - special story on ankam jyothi from nizamabad district

ఏమీ తెలియని పసితనంలోనే ప్రేమను పంచాల్సిన తల్లిదండ్రులు దూరమయ్యారు. గోరు ముద్దలు తినాల్సిన సమయంలోనే... పస్తులుండడం నేర్చుకుంది. ఇద్దరు చెల్లెల్ల బాధ్యతలు మీదేసుకుని మోయలేని భారాన్ని తలకెత్తుకుంది. ఎవరూ ఆదుకునే వారు లేని స్థితిలో...చుట్టు పక్కల వాళ్ల చీదరింపులు, అవమానాలు మరింత కుంగదీశాయి. అయినా...వాటన్నింటినీ తట్టుకుని..విధి రాతకు కష్టంగా ఎదురీదింది. తన జీవితాన్ని తానే నిర్మించుకున్న ఆ యువతి.. ఇప్పుడు గతంలో తాను చూసిన ఆకలి కష్టాలు మరెవరికీ ఉండకూడదనే ఉద్దేశంతో...ఆకలితో అలమటించే పేదల కడుపు నింపుతోంది. పది మందికి ఆదర్శంగా నిలుస్తోంది.

special story on ankam jyothi from nizamabad district
'ఆకలి కష్టాలు చూసి... పేదల కడుపు నింపుతోంది'

By

Published : Mar 10, 2022, 10:58 AM IST

ఎన్నో కష్టాల్ని దాటుకుని ముందుకు సాగుతున్న జ్యోతి

ప్రతీ వ్యక్తిపై...చుట్టు ఉన్న పరిస్థితులు, వాళ్లు చూసిన సంఘటనలు, అనుభవాలు తీవ్రంగా ప్రభావం చూపుతుంటాయి. అవే వాళ్ల వ్యక్తిత్వాన్ని నిర్దేశిస్తాయి. అయితే.. కొంత మంది కష్టాల్ని సాకుగా చూపి...చెడు బాట పడితే, మరికొందరు.. నలుగురికీ ఆదర్శంగా నిలిచేలా తమ జీవితాల్ని తీర్చిదిద్దుకుంటారు. అలాంటి వాళ్లల్లో ఒకరిగా నిలుస్తోంది... నిజామాబాద్‌ జిల్లా భీంగల్‌కు చెందిన అంకం జ్యోతి.

జ్యోతి తల్లిదండ్రులు నిత్యం గొడవపడుతుండే వాళ్లు. చీటికీమాటికి పోట్లాడుకునే వారు. ఆ గొడవలు, ఆందోళనల మధ్యలోనే జ్యోతి, ఆమె ఇద్దరు చెల్లెల్లు బిక్కుబిక్కుమంటూ గడిపే వాళ్లు. అనుకోకుండా జరిగిన ఓ ఘటనతో వీళ్ల జీవితాలే మారిపోయాయి. సమాజంలో ఒంటరిగా మిగిలిపోయారు.

ఏదైనా సాధించాలనే పట్టుదలతో

నాన్నమ్మ దగ్గరే పెరిగిన ముగ్గురు ఆడపిల్లలు..ఎన్నో ఇబ్బందులకు గురయ్యారు. చిన్న వయసులోనే తల్లిదండ్రులు ప్రేమను కోల్పోయిన జ్యోతి... సరిగా పట్టించుకునే వాళ్లు లేక జీవితంలో గడ్డు పరిస్థితుల్ని ఎదుర్కొంది. ఒకానొక దశలో ఆత్మహత్యకు ప్రయత్నించి... చెల్లెలు గుర్తుకు రావడంతో.. విరమించుకుంది. అంతే కాదు... ముగ్గురిలో జ్యోతినే పెద్దది కావడంతో... కుటుంబ బాధ్యతల్ని భుజానికెత్తుకుంది. జీవితంలో ఏదైనా సాధించాలనే పట్టుదలను పెంచుకుని ఆ దిశగా ప్రయాణం ప్రారంభించింది.

మేం ముగ్గురం అక్కచెల్లేలం. మమ్మల్ని నాయనమ్మ చూసుకునేది. నా బాల్యం అంత గొప్పగా బతకలేదు. ఓ రోజు అన్నం దొరికితే తినేదాన్ని. ఓ రోజు పాడైనా అన్నమైనా తినేదాన్ని. అందరూ కొట్టేవాళ్లు. తిట్టేవాళ్లు. అయినా... సరే మాచెల్లేల కోసం బతకాలి అనుకున్నా...

- అంకం జ్యోతి, సామాజిక సేవకురాలు, నిజామాబాద్

ఆకలి బాధలు తెలిసి...

నిజామాబాద్‌లోని తెలంగాణ జాగృతిలో 3 నెలల లాజిస్టిక్స్ కోర్సు నేర్చుకున్న జ్యోతి.. ఓ సంస్థలో ప్రైవేట్‌ ఉద్యోగంలో చేరింది. నగరంలోని ప్రభుత్వ వసతి గృహంలో ఉంటూ... పని చేసింది. ఆ సమయంలోనే తన సంపాదిస్తున్న కొద్ది మొత్తంలోనే సేవా కార్యక్రమాలు చేయడం ప్రారంభించింది. ఒకప్పుడు తాను అనుభవించిన ఆకలి బాధల విలువ తెలియడంతో.. అలాంటి వాళ్లు కనిపిస్తే చాలు తోచినంత సాయం చేయడం మొదలు పెట్టింది.

రోడ్లపైనే ఉండే నిరాశ్రయులు, మతిస్థిమితం లేని వాళ్లకు సాయంగా నిలుస్తోంది.. ఈ యువతి. తనకొచ్చే కొద్దిపాటి సంపాదనలో...అధిక భాగం సేవా కార్యక్రమాలకే వినియోగిస్తోంది. రోడ్డుపై ఆకలితో అలమటించే వాళ్లకు ఇంట్లోనే వంట చేస్తూ... ఆహారం అందజేస్తోంది. వీటి కోసం ఇప్పటి వరకు ఎవరి దగ్గరా విరాళాలు సేకరించడం లేదు. తన సంపాదనలోనే ఈ సేవల్ని అందిస్తోంది.

ఆహరమే కాదు... చలిలో రాత్రిళ్లు రోడ్లపై నిద్రించే పేదలకు దుప్పట్లు అందిస్తోంది. అవసరంలో ఉన్న వారికి దుస్తులు సైతం అందిస్తూ... మానవత్వాన్ని నిరూపించుకుంటోంది. ఎవరో సహకరించాలని లేకుండా.. తన వంతు సాయాన్ని తాను చేస్తోంది.

ఎన్ని కష్టాలు వచ్చినా... ప్రతి ఒక్కరి ముందు నవ్వుతూనే ఉన్నా... ఈ చావు అనేది చిన్నది. ఒక సందర్భంలో చనిపోదాం అనుకున్నా.. కానీ చెల్లేల్ని ఎవరు చూస్తారు. నేను తినకపోయినా పర్వాలేదు.. వారిని బాగా చూసుకోవాలి అనుకున్నా... ప్రతి ఒక్కరికి డబ్బు లేకున్నా ఫర్వాలేదు.. అన్నం ఉండాలి. నేను పడ్డ బాధలు మిగతా వాళ్లు పడకూడదని... నా వంతు సాయం చేస్తున్నా... జీతం తక్కువే... కానీ ఉన్నంతలో సాయం చేస్తున్నా...

- అంకం జ్యోతి, సామాజిక సేవకురాలు, నిజామాబాద్

చెల్లెళ్ల బాధ్యత చూస్తున్న జ్యోతి.. మొదటి చెల్లి పెళ్లి చేసింది. రెండో చెళ్లి చదువుకుంటుండ డంతో.. ఇటీవలే.... తాను వివాహం చేసుకుంది. జ్యోతి సేవల గురించి తెలుసున్న భర్త ఆమెకు తోడుగా నిలుస్తున్నాడు.

ఎక్కడికెళ్లినా... ఏం చేసినా... మనకు ఉన్నంతలో సాయం చేద్దామని... చేస్తున్నాం. ఆమెకు తోడుగా ఉంటున్నా...

- అంకం జ్యోతి భర్త , సామాజిక సేవకురాలు, నిజామాబాద్

జ్యోతి సేవలకు వివిధ సంస్థలు, ప్రభుత్వాలు వివిధ అవార్డ్‌లు అందించాయి. 2 జాతీయ అవార్డులు సైతం అందుకుంది.. ఈ యువతి. తలసేమియా బాధితుల కోసం చేసిన సేవలకు సోనుసూద్ ను కలిసేందుకు అవకాశమూ లభించింది.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details