తెలంగాణ

telangana

By

Published : Jul 22, 2020, 2:18 PM IST

ETV Bharat / state

కరోనా వైరస్ కన్నా ముందు ఆందోళనే చంపుతోంది

కరోనా ఎప్పుడు ఎవరికి ఎక్కడి నుంచి సోకుతుందో తెలియడం లేదు. ఎవ్వరినీ స్థిమితంగా ఉండనీయడం లేదు. ఎవరిని కదిపినా కరోనా వస్తుందేమోనన్న భయమే వెంటాడుతోంది. మాస్కులు, శానిటైజర్​లు, పీపీఈ కిట్లు.. ఇలా అందుబాటులో ఉన్న వాటితో రక్షణ పొందే ప్రయత్నం చేస్తున్నారు. ఇంటి చిట్కాలు, వైద్యులు సూచించిన మందులు వాడుతూ వైరస్ రాకుండా జాగ్రత్త పడుతున్నారు. అయితే ఇన్ని చేసినా వైరస్ ఎప్పుడు ఎవ్వరినీ ఏ విధంగా కబలిస్తుందో తెలియడం లేదు.

coronavirus
coronavirus

కరోనా వైరస్‌ భయాందోళనకు గురిచేస్తోంది. కొవిడ్ వచ్చిందన్న ఆందోళనతోనే కొందరు మృత్యువాత పడుతున్నారు. నిజామాబాద్ నగరానికి చెందిన ఓ 65ఏళ్ల వృద్ధురాలు తన కుమారుడు, కూతురు, ఇతర సన్నిహితులతో కలిసి హైదరాబాద్‌కు షాపింగ్ కోసం వెళ్లింది. మనవడి పెళ్లి కోసమని బట్టలు, ఇతర వస్తువులు కొనుగోలు చేసి తిరిగి వచ్చారు. కూతురికి స్వల్పంగా లక్షణాలు కనిపిస్తే కరోనా పరీక్ష చేయించుకుంటే పాజిటివ్ అని తేలింది. వెంటనే ఆమెతో పాటు షాపింగ్ చేసిన సోదరుడు, అతని భార్య పరీక్షలు చేయించుకోగా.. భార్యకు నెగిటివ్, భర్తకు పాజిటివ్ అని తేలింది.

రెండు రోజుల తర్వాత వృద్ధురాలికి కూడా పరీక్షలు చేయించారు. ఆమెకూ పాజిటివ్ వచ్చింది. తన కుమారుడు, కూతురుతోపాటు తనకు కూడా పాజిటివ్ రావడం ఆమెను తీవ్రంగా కలిచివేసింది. అదే విషయంపై మథన పడుతూ కరోనా పాజిటివ్ అని తెలిసిన రోజు రాత్రే టాయిలెట్‌కు వెళ్లి గుండెపోటు వచ్చి మరణించింది. దీంతో కూతురు, కుమారుడు, అయిన వాళ్లందరూ ఉన్నా అనాథలా ఆంబులెన్స్‌లో తీసుకెళ్లి అంత్యక్రియలు చేశారు.

గుండెపోటుతో

ఆర్మూర్‌కు చెందిన ఓ వైద్యుడు ఇదే తరహాలో మృతి చెందాడు. పాజిటివ్ అని తేలిన తర్వాత గాంధీ ఆస్పత్రిలో చికిత్స కోసం చేరాడు. రెండు రోజుల పాటు గాంధీలోనే ఉన్న వైద్యుడు తన కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులతో ఫోన్ లో మాట్లాడుతూ చనిపోతానేమోనని ఆందోళన వ్యక్తం చేశాడు. అందరూ ధైర్యం చెప్పినా... మూడో రోజు ఉదయం గుండెపోటు వచ్చి చనిపోయాడు.

ఫలితాలు రాకముందే

కామారెడ్డి జిల్లా బీర్కూర్‌కు చెందిన ఓ రిటైర్డ్ తహసీల్దార్‌... కరోనా లక్షణాలు కనిపించడంతో బాన్సువాడ ఆస్పత్రిలో శాంపిల్స్ ఇచ్చాడు. ఇంటికి వచ్చినప్పటి నుంచి తనకు కరోనా వస్తుందేమోనన్న ఆందోళన వ్యక్తం చేశాడు. కుటుంబీకులు, స్నేహితులు, తెలిసిన వాళ్లు అందరూ... కరోనా వచ్చినా ఏం కాదు ధైర్యంగా ఉండాలని సూచించారు. పరీక్షా ఫలితాలు రాకముందే మరుసటి రోజు రాత్రి గుండె పోటుతో మృతి చెందాడు. కుటుంబ సభ్యులకు అంత్యక్రియలు ఎలా చేయాలో అర్థం కాక.. వైద్యులను సంప్రదిస్తే ఫలితాలు ఇంకా రాలేదని చెప్పారు. దీంతో సంప్రదాయ పద్ధతిలో అంత్యక్రియలు చేశారు. అంత్యక్రియలు పూర్తయిన పది నిమిషాలకు మృతుడికి కరోనా పాజిటివ్ అని రిపోర్ట్ వచ్చింది.

ఆందోళతోనే మరణిస్తున్నారు

ఇలా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాల్లోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి కేసులు అనేకం ఉన్నాయి. చాలా మంది కరోనా వైరస్ వస్తుందేమోనన్న ఆందోళన, పాజిటివ్ వస్తే చనిపోతామేమోనని మథన పడుతూ ఉన్నారు. దీంతో గుండెపోటు వచ్చి చనిపోతున్నారు. వైరస్ వచ్చిన అనేక మంది కోలుకుని సాధారణ జీవితం గడుపుతున్న విషయం తెలిసినా.. ఆందోళన చెందుతూనే ఉన్నారు. కరోనా కంటే ముందే గుండె పోటుతో మృత్యువు దరి చేరుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details